IND vs SA : సౌతాఫ్రికా నుంచి అత్యవసరంగా ఇండియాకు వచ్చేసిన విరాట్ కోహ్లీ
దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత జట్టు రెండు టెస్టు మ్యాచులు ఆడనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ డిసెంబర్ 26 నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పటికే సౌతాఫ్రికాకు చేరిన టీమిండియా ప్లేయర్లు ప్రాక్టీస్‌ను కూడా మొదలు పెట్టారు. మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ సైతం ఆడారు. అయితే మరికొన్ని రోజుల్లో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) భారత్‌కు తిరిగి రావడం చర్చనీయాంశంగా మారింది. వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ మైదానంలోకి అడుగుపెట్టలేదు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు కోహ్లీ ఎంపికయ్యాడు. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా కోహ్లీ ముంబైకి వచ్చినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
తొలి టెస్టుకు అందుబాటులో కోహ్లీ
స్వదేశానికి వచ్చిన కోహ్లీ, జోహన్నెస్ బర్గ్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టుకు జట్టుతో కలుస్తాడని తెలిసింది. ఇక టెస్టు సిరీస్ కోసం భారత జట్టు పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తోంది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రాలు రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. భారత జట్టు రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ.