Axar Patel: తండ్రైన అక్షర్ పటేల్.. ముందే చెప్పిన రోహిత్ శర్మ!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తండ్రయ్యాడు. అక్షర్ సతీమణి మేహా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని అక్షర్ డిసెంబర్ 24న మంగళవారం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. కుమారుడి చేతిలో భారత జెర్సీ ధరించిన ఫొటోను షేర్ చేస్తూ, డిసెంబర్ 19న తనకు కొడుకు పుట్టినట్లు, ఆ బిడ్డకు "హక్ష్ పటేల్" అనే పేరు పెట్టినట్లు తెలిపారు. దీంతో అక్షర్‌కు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం అక్షర్ పటేల్ భారత జట్టుకు దూరంగా ఉన్నాడు.
అక్షర్ ఆస్ట్రేలియా పర్యటనకు రావడం కష్టమే
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో అక్షర్‌ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. అయితే అక్షర్ పితృత్వ సెలవుల్లో ఉన్నాడు. మంగళవారం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ అశ్విన్ స్థానంలో కోటియన్‌ను తీసుకునే కారణం అక్షర్ తండ్రయ్యాడని, ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనకు రావడం కష్టమని చెప్పాడు. అక్షర్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీతో తిరిగి జట్టులోకి రావాలని ఆశిస్తున్నారు. ఇప్పటివరకు అక్షర్ భారత తరఫున 14 టెస్టులు, 60 వన్డేలు, 66 టీ20లు ఆడాడు.