David Warner: పుష్ప ఫోజుతో డేవిడ్ వార్నర్ కు అల్లు అర్జున్ విషెష్
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇవాళ తన 38వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతనికి ప్రపంచ వ్యాప్తంగా పలువురు క్రికెటర్లు, మాజీలు, సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో వార్నర్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. పోస్ట్‌లో పుష్ప ట్రేడ్‌మార్క్ ఫోజుతో డేవిడ్ వార్నర్ ఫొటోని షేర్ చేస్తూ, "మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు మై బ్రదర్" అని క్యాప్షన్ జత చేశాడు. డేవిడ్ వార్నర్ ఐసీసీ వరల్డ్ కప్ 2015, 2023లో ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడిగా ప్రదర్శన ఇచ్చాడు. ఈ రెండు మెగా టోర్నమెంట్లలో అతనే అత్యధిక స్కోర్ సాధించాడు.
డేవిడ్ వార్నర్ సాధించిన రికార్డులివే!
2013 వరల్డ్ కప్‌లో 510 పరుగులు, 2019 ఐసీసీ వరల్డ్ కప్‌లోనూ అత్యధిక పరుగులు సాధించి తన ప్రతిభను చాటుకున్నాడు. 2021 టీ20 వరల్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ ఏడాది జనవరి 1న డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వన్డే, టీ20 ఇంటర్నేషనల్స్, టెస్ట్ ఫార్మాట్‌కి గుడ్ బై చెప్పి, 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. 112 టెస్ట్ మ్యాచ్‌లను ఆడిన డేవిడ్ వార్నర్, 8,786 పరుగులు సాధించాడు. ఇందులో 26 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలు చేశాడు. 161 వన్డేల్లో 6,932 పరుగులు సాధించి, 22 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు బాదాడు.