నికోలస్ పూరన్ విధ్వంసం.. 6 భారీ సిక్సర్లు, 9 ఫోర్లతో మెరుపు సెంచరీ
ఐసీసీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ మ్యాచుల్లో వెస్టిండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టిస్తున్నాడు. సిక్సర్లు, ఫోర్లతో బౌండరీల మోత మోగిస్తున్నాడు. ఇప్పటివరకూ రెండు సెంచరీలు చేశాడు. తాజాగా నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచులో సెంచరీతో చెలరేగగా, అంతకుముందు నేపాల్‌పై 94 బంతుల్లో 115 పరుగులు చేసి అదరగొట్టాడు. హరారేలో జరిగిన వన్డే ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ మ్యాచులో నికోలస్ పూరన్ అద్భుత సెంచరీ సాధించాడు. ఈ మ్యాచులో నెదర్లాండ్స్ జట్టు మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన వెస్టిండీస్ ఆరంభంలోనే బ్రెండన్ కింగ్(76), జాన్సన్ చార్లెస్(54) పరుగులతో శుభారంభం అందించారు. తర్వాత షాయ్ హోప్, నికోలస్ పూరన్ సైతం నైదర్లాండ్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు.
ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచుల్లో రెండు సెంచరీలు బాదిన నికోలస్ పూరన్
షాయ్ హోప్ 38 బంతుల్లో (2 సిక్సర్లు, 3 ఫోర్లు) 47 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. మరోవైపు నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పూరన్ ధాటికి నెదర్లాండ్స్ బౌలర్లు చిత్తయ్యారు. పూరన్ 65 బంతుల్లో (6 సిక్సర్లు, 9 ఫోర్లు) 104 పరుగులు చేశాడు. దీంతో వెస్టిండీస్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ టై కావడంతో, సూపర్ ఓవర్‌లో నెదర్లాండ్స్ విజయం సాధించింది. వన్డే ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచులో నికోలస్ పూరన్‌కు ఇది రెండో సెంచరీ కావడం విశేషం.