ఇండియాతో ఎక్కడైనా ఆడటానికి రెడీ : పాకిస్థాన్ కెప్టెన్
భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ అక్టోబర్ 5న ప్రారంభం కానుంది. టీమిండియా, పాకిస్థాన్ మధ్య అక్టోబర్ 15న హై ఓల్టేజ్ మ్యాచ్ నరేంద్రమోదీ స్టేడియంలో జరగనుంది. ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియాకి పాకిస్థాన్‌పై ఘనమైన రికార్డు ఉంది. అయితే 2021 టీ20 వరల్డ్ కప్‌లో తొలిసారిగా టీమిండియాను పాకిస్థాన్ ఓడించింది. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాక్‌పై భారత్ గెలుపొందింది. వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియాపై జరిగే మ్యాచ్ గురించి పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ స్పందించాడు. ఇండియాకు వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతి కోరామని, తాము కేవలం భారత్ పై ఆడేందుకు ఇండియాకు వెళ్లడం లేదని అతను స్పష్టం చేశాడు.
భారత జట్టుపైన మాత్రమే ఫోకస్ చేయడం లేదు
కేవలం భారత జట్టుపై మాత్రమే తాము ఫోకస్ చేయడం లేదని, అక్కడ మరో తొమ్మిది జట్లు ఉన్నాయని, ప్రత్యర్థి జట్లు అన్నింటినీ ఓడించినప్పుడే తాము ఫైనల్స్‌కు చేరుతామని బాబర్ ఆజమ్ స్పష్టం చేశాడు. ప్రపంచంలో క్రికెట్ మ్యాచులు ఎక్కడ జరిగినా వెళ్లి ఆడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఇండియాలో ఎక్కడైనా, ఎవరితోనైనా ఆడేందుకు తాము రెడీగా ఉన్నామని చెప్పుకొచ్చాడు. ఇండియాలో వరల్డ్ కప్ ఆడడం ఇదేమీ తొలిసారి కాదన్నారు. ఏయే మ్యాచులు ఆడబోతున్నామో తమ దగ్గర పూర్తి షెడ్యూల్ ఉందని, దానికి అనుగుణంగా ప్రణాళికలు రచించుకుంటూ ముందుకెళ్తామన్నారు.