LOADING...
Aryan Dutt: భారత్‌తో మ్యాచ్‌లో ఆకట్టుకున్న నెదర్లాండ్స్‌ యువ స్పిన్నర్‌ ఆర్యన్‌ దత్
భారత్‌తో మ్యాచ్‌లో ఆకట్టుకున్న నెదర్లాండ్స్‌ యువ స్పిన్నర్‌ ఆర్యన్‌ దత్

Aryan Dutt: భారత్‌తో మ్యాచ్‌లో ఆకట్టుకున్న నెదర్లాండ్స్‌ యువ స్పిన్నర్‌ ఆర్యన్‌ దత్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 19, 2026
09:41 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ జట్టు పరాజయం పాలైనప్పటికీ, వారి స్పిన్నర్‌ ఆర్యన్‌ దత్‌ తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. కొత్త బంతితో దాడి ఆరంభించిన ఈ 22 ఏళ్ల ఎత్తైన ఆఫ్‌స్పిన్నర్‌ తొలి ఓవర్‌లోనే అభిషేక్‌ శర్మను ఖాతా కూడా తెరవకుండా ఔట్‌ చేసి భారత అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఎక్కువగా మలుపు ఇవ్వకుండా, లెగ్‌ స్టంప్‌ను లక్ష్యంగా చేసుకుని వేసిన బంతికి అభిషేక్‌ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఇటీవల పాకిస్థాన్‌పై అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన ఇషాన్‌ కిషన్‌ను కూడా ఆర్యన్‌ ఔట్‌ చేసి తన సామర్థ్యాన్ని చాటుకున్నాడు. నాలుగు ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు సాధించడం ద్వారా అతడు కట్టుదిట్టమైన బౌలింగ్‌ను ప్రదర్శించాడు.

వివరాలు 

2011 ప్రపంచకప్‌ పోటీలతో ఆర్యన్‌కు క్రికెట్‌పై ఆసక్తి

ఆర్యన్‌ తండ్రిది భారతే. 1980లో వారి కుటుంబం పంజాబ్‌లోని హోషియార్‌పుర్‌ నుంచి నెదర్లాండ్స్‌కు వలస వెళ్లి అక్కడే స్థిరపడింది. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ, ఆ కుటుంబానికి భారత్‌తో గాఢమైన అనుబంధం కొనసాగుతోంది. 2011 ప్రపంచకప్‌ పోటీలను చూసిన తర్వాత ఆర్యన్‌కు క్రికెట్‌పై ఆసక్తి పెరిగింది. ఎంఎస్‌ ధోనిని ఆదర్శంగా తీసుకుని క్రికెట్‌ వైపు అడుగులు వేసాడు. నెదర్లాండ్స్‌లోనే క్రికెట్‌ ప్రాథమిక శిక్షణ పొందిన అతడు, అనంతరం చండీగఢ్‌లో మూడు సంవత్సరాలు ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు.

వివరాలు 

2021లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం

2021లో నేపాల్‌పై జరిగిన మ్యాచ్‌తో ఆర్యన్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో కూడా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్‌ సాధించిన సంచలన విజయంలో అతడు ముఖ్య పాత్ర పోషించాడు. 2024లో నమీబియాతో జరిగిన ప్రపంచకప్‌ లీగ్‌-2 మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీసి తన ప్రతిభను మరోసారి రుజువు చేశాడు. ఇప్పటివరకు 53 వన్డేలు, 29 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఈ స్పిన్నర్‌ వన్డేల్లో 62 వికెట్లు, టీ20ల్లో 30 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

Advertisement