Asia Cup: ఆసియా కప్‌లో ఇప్పటి వరకు బద్దలు కాని రికార్డులివే!
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 ఆగస్టు 30న ప్రారంభం కానుంది. భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్‌కి ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఆసియా కప్‌పై నెలకొంది. ఈ మెగాటోర్నీలో భాగంగా నాలుగు మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో, తొమ్మిది మ్యాచ్‌లు శ్రీలంకలో జరగనున్నాయి. గత ఆసియాకప్‌లలో ఎప్పటికి చెరిగిపోని రికార్డులు ఉన్నాయి. ఆసియా కప్‌లో ఐదుసార్లు ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గా శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ రికార్డుకెక్కాడు. 2012లో పాకిస్థాన్‌పై 150 ప్లస్ పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఆ మ్యాచులో 148 బంతుల్లో 183 పరుగులను కోహ్లీ చేశాడు.
ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేసిన షాహిద్ ఆఫ్రిది
ఆసియా కప్ వన్డే ఎడిషన్లలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన రికార్డును పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సొంతం చేసుకున్నాడు. 2010లో బంగ్లాదేశ్‌పై కేవలం 53 బంతుల్లో సెంచరీ మార్కును అందుకొని చరిత్ర సృష్టించాడు. 2008లో శ్రీలంక మాజీ అల్ రౌండర్ సనత్ జయసూర్య 55 బంతుల్లో సెంచరీని బాది రెండో స్థానంలో నిలిచాడు. 2012 ఆసియా కప్‌లో పాకిస్థాన్ ఓపెనర్లు నాసిర్ జంషెడ్, మహ్మద్ హఫీజ్ భారత్‌పై తొలి వికెట్‌కు 224 పరుగులను జోడించడం విశేషం. ఆసియా కప్ టీ20 ఎడిషన్‌లో గతేడాది ఆఫ్ఘనిస్థాన్‌పై భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లను తీసి అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. ఈ ఐదు వికెట్లలో నాలుగు పవర్‌ప్లే పడగొట్టడం గమనార్హం.