టీమిండియాను చూసి ఆసీస్ వణుకుతోంది: విరాట్ కోహ్లీ
ఒకప్పుడు ఆస్ట్రేలియా జట్టుతో తలపడాలంటే ప్రత్యర్థి జట్టులకు భయం ఉండేది. ఫీల్డ్ లో అవతలి వాళ్లను మాటలతో, ఆటతో ముప్పు తిప్పులు పెట్టేవారు. అయితే ఆస్ట్రేలియా పై గడ్డపై టీమిండియా రెండు టెస్ట్ సీరిస్ లు గెలిచాక టీమిండియాతో మ్యాచ్ అంటే ఆసీస్ వణికిపోతోందని మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో టీమిండియా పోరాడనుంది. స్టార్ స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలను చేశాడు. గతంలో టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య పోరు తీవ్రంగా ఉండేదని, అయితే తాము వరుసగా రెండు సిరీస్ లు గెలిచిన తర్వాత ఆ పోటీ కాస్తా గౌరవంగా మారిందని, చెప్పుకొచ్చాడు.
టీమిండియాను తేలిగ్గా తీసుకొనే పరిస్థితి లేదు
ఓ టెస్టు టీమ్ గా టీమిండియాను తేలిగ్గా తీసుకొనే పరిస్థితి లేదని, తమపై ప్రత్యర్థులకు గౌరవం పెరిగిందని, విదేశాల్లో కూడా గట్టి పోటీ ఇస్తామని వాళ్లు గుర్తించారని కోహ్లీ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాతో ఆడేటప్పుడు అత్యుత్తమంగా రాణించడానికి ప్రయత్నిస్తానని, ఎందుకంటే ఆస్ట్రేలియా గట్టి పోటినిస్తుందని, దీంతో బాగా ఆడాలనే కసి తనలో పెరుగుతుందన్నారు. విరాట్ కోహ్లీ సారథ్యంలో 2018-19 పర్యటనలో కంగారులను తొలిసారి ఓడించిన టీమిండియా 2020-21 అంజిక్యా రహానే సారథ్యంలో ఆస్ట్రేలియాను రెండోసారి వారి సొంతగడ్డపై ఓడించి భారత జట్టు చరిత్ర సృష్టించింది.