Ban vs Pak: బంగ్లాదేశ్ చేతిలో పాకిస్థాన్‌కు ఘోర ఓటమి.. తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో బంగ్లా విజయం
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్‌లో నిరాశాజనక ప్రదర్శనతో సూపర్-8 దశలోనే టోర్నీకి గుడ్‌బై చెప్పిన పాకిస్థాన్‌కు మరో షాక్ తగిలింది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను పాక్ జట్టు ఘోర ఓటమితో ప్రారంభించింది. బుధవారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై సునాయాస విజయం సాధించింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' నహిద్ రాణా (5/24) విజృంభించడంతో.. పాక్ 30.4 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. పాక్ తరఫున ఫహీమ్ అష్రాఫ్ 37 పరుగులతో కొంత ప్రతిఘటన చూపించినప్పటికీ, మిగతా బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. సాహిబ్జాదా ఫర్హాన్ 27,సదాఖత్ 18,మహ్మద్ రిజ్వాన్ 10 పరుగులు చేసి రెండంకెల స్కోరుకు పరిమితమయ్యారు.
వివరాలు
అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం నలుగురు పాక్ ఆటగాళ్లు
నహిద్ రాణాకు తోడుగా మెహిదీ హసన్ 3 వికెట్లు తీసి పాక్ బ్యాటింగ్‌ను కట్టడి చేశాడు. అనంతరం లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ బ్యాటర్లు దూకుడుగా ఆడారు. తంజిద్ హసన్ మెరుపు ఇన్నింగ్స్‌తో 42 బంతుల్లోనే 67 పరుగులు చేసి జట్టుకు బలమైన ఆరంభం ఇచ్చాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు నజ్ముల్ హొస్సేన్ శాంటో 27 పరుగులతో సహకరించాడు. దీంతో బంగ్లాదేశ్ 15.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుని విజయం సాధించింది. పాకిస్థాన్ తరఫున కెప్టెన్ షహీన్ షా అఫ్రిది, మహ్మద్ వసీమ్ చెరో వికెట్ తీసుకున్నారు. ఇదిలా ఉంటే,ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టులో నలుగురు ఆటగాళ్లు అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేశారు.