Page Loader
Champions Trophy 2025: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రా ఔట్?
బీసీసీఐ కీలక నిర్ణయం.. ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడతాడా?

Champions Trophy 2025: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రా ఔట్?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 11, 2025
12:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమరం ప్రారంభానికి మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఎనిమిది జట్లు పోటీపడనున్న ఈ మెగా టోర్నీ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించగా, మార్పులు, చేర్పులకు గడువు మంగళవారంతో ముగియనుంది. అయితే టీమిండియా స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా టోర్నీలో పాల్గొంటాడా, లేదా అనే దానిపై బీసీసీఐ ఈరోజు నిర్ణయం తీసుకోనుంది.

Details

బుమ్రా దూరమైతే ఎవరు వస్తారు? 

ఆస్ట్రేలియా పర్యటన ముగింపు దశలో వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్న బుమ్రా, అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. మూడో వన్డేలో ఇంగ్లాండ్‌తో ఆడి తన ఫిట్‌నెస్ నిరూపించుకునే అవకాశం ఉందని భావించినా, బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కొనసాగుతుండటంతో అతని ఆరోగ్య స్థితిపై అనుమానాలు పెరిగాయి. ఒకవేళ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైతే, యువ పేసర్ హర్షిత్ రాణా జట్టులో చోటు దక్కించుకునే అవకాశముంది. హర్షిత్ ఇటీవల ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో అరంగేట్రం చేసి ఆకట్టుకున్నాడు. నాగ్‌పూర్ వన్డేలో 7 ఓవర్లు వేసి 53 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టిన అతను, రెండో వన్డేలో 9 ఓవర్లు వేసి 62 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు.

Details

వరుణ్ చక్రవర్తి ఎంపికైతే ఎవరు దూరం? 

అయినా బుమ్రా అందుబాటులో లేకపోతే, టీమ్‌ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలో అరంగేట్రం చేసిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే టీ20 సిరీస్‌లో అదరగొట్టి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచిన అతను, వన్డే జట్టులో కూడా స్థానం సంపాదించుకున్నాడు. తన తొలి వన్డేలో 10 ఓవర్లు వేసి 54 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. వరుణ్ జట్టులోకి వస్తే కుల్‌దీప్ యాదవ్ లేదా వాషింగ్టన్ సుందర్‌లో ఎవరో ఒకరు బెంచ్‌కు పరిమితమయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 11 తర్వాత కూడా ఐసీసీ సాంకేతిక కమిటీ అనుమతితో మార్పులు చేయవచ్చని సెలక్టర్లు భావిస్తున్నారు.