
BCCI: బీసీసీఐ అధ్యక్ష పదవికి రోజర్ బిన్నీ రాజీనామా.. తాత్కాలిక ప్రెసిడెంట్‌గా రాజీవ్ శుక్లా.. కొత్త స్పాన్సర్ కోసం బీసీసీఐ ప్రయత్నాలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో పెద్ద మార్పు చోటుచేసుకుంది. గత నెలలో 70 ఏళ్ల వయసు పూర్తి చేసుకున్న మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయన స్థానంలో తాత్కాలికంగా ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా బాధ్యతలు స్వీకరించారు. తదుపరి ఎన్నికల వరకు ఆయనే బీసీసీఐ అధ్యక్షుడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన లోధా కమిటీ సిఫార్సుల ప్రకారం బీసీసీఐ అధ్యక్షుడి వయస్సు పరిమితి 70 ఏళ్లు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్- 2025 ప్రకారం ఈ పరిమితి 75 ఏళ్లకు పెంచారు.
వివరాలు
బీసీసీఐ ఏపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ప్రధాన అజెండాగా స్పాన్సర్‌షిప్
దీని ప్రకారం బిన్నీ పదవిలో కొనసాగవచ్చని భావించినా,ఆ బిల్లు ఇంకా అమల్లోకి రాకపోవడంతో తాత్కాలికంగా శుక్లా బాధ్యతలు చేపట్టారు. దైనిక్ జాగరణ్ నివేదిక ప్రకారం,బిన్నీ రాజీనామా చేసిన తరువాతే శుక్లా పదవి చేపట్టినట్టు తెలుస్తోంది. అయితే సెప్టెంబర్‌లో జరగబోయే వార్షిక సర్వసభ్య సమావేశం(AGM)వరకు బిన్నీ మళ్లీ పోటీ చేసే అవకాశముందని కూడా సమాచారం. ఇక మరో కీలక అంశం ఏంటంటే .. బీసీసీఐ స్పాన్సర్‌షిప్ వ్యవహారం. డ్రీమ్11తో ఉన్న ఒప్పందం ముగియడంతో కొత్త స్పాన్సర్ కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. బుధవారం జరిగిన బీసీసీఐ ఏపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశం ప్రధాన అజెండాగా నిలిచింది. సెప్టెంబర్ 9న మొదలయ్యే ఆసియా కప్‌కు ముందే కొత్త స్పాన్సర్‌ను ఖరారు చేయాలనే ఉద్దేశ్యంతో చర్చలు జరుగుతున్నాయి.
వివరాలు
2027 వరల్డ్ కప్ వరకూ స్పాన్సర్
"మాకు రెండు వారాల సమయం కూడా మిగలలేదు. కొత్త టెండర్ పిలవడం, లీగల్ ప్రాసెస్ పూర్తిచేయడం, టెక్నికల్ విషయాలు పూర్తి చేయడం కాస్త సమయం పడుతుంది. కేవలం ఆసియా కప్‌కోసమే తాత్కాలిక స్పాన్సర్ తీసుకోవడం లేదు. మా లక్ష్యం వచ్చే రెండున్నర సంవత్సరాలకు, అంటే 2027 వరల్డ్ కప్ వరకూ స్పాన్సర్‌ను ఖరారు చేయడమే" అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.