రోహిత్ శర్మ కెప్టెన్సీపై గంభీర్ వ్యాఖ్యలు.. తేడా వస్తే విమర్శలు వస్తాయంటూ కామెంట్స్
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆసియా కప్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీ ఆకట్టుకుందని రోహిత్ సారధ్యంలో కప్పు గెలవడం ఇది రెండవసారని, కెప్టెన్ గా అతడు తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తాడని గౌతమ్ గంభీర్ అన్నారు. అయితే కెప్టెన్ గా అసలు పరీక్ష ముందు ఉందని, వన్డే ప్రపంచ కప్ రూపంలో రోహిత్ శర్మకు పరీక్ష ఎదురు కాబోతుందని, అక్కడ ఏదైనా తేడా వస్తే రోహిత్ శర్మ పై విమర్శలు వెల్లువలా వచ్చి పడతాయని గౌతమ్ గంభీర్ కామెంట్స్ చేశారు.
గతంలో రాహుల్ ద్రావిడ్, కోహ్లీ పై విమర్శలు
ఇప్పుడు ఎలాగైతే ప్రశంసలు వస్తున్నాయో అలాగే ప్రపంచకప్ లో ఏదైనా తేడా వస్తే విమర్శలు కూడా విపరీతంగా ఎదురవుతాయని, అందువల్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు. భారత జట్టులో ఆటగాళ్లందరూ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారని, కానీ ప్రపంచ కప్ లో వాళ్లు సరిగ్గా ఆడకపోతే రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతాయని గంభీర్ కామెంట్స్ చేశారు. 2007 సంవత్సరంలో రాహుల్ ద్రావిడ్, అలాగే ఒకానొక టైంలో విరాట్ కోహ్లీ కూడా విమర్శలు ఎదుర్కొన్నారని గౌతమ్ గంభీర్ గుర్తు చేశారు. అదలా ఉంచితే ప్రపంచ కప్ కంటే ముందుగా ఆస్ట్రేలియాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 22నుండి ఈ సిరీస్ ప్రారంభమవుతుంది.