Sports News: టీ20 సిరీస్ ఇప్పుడెందుకు..? బెట్ పోయిందన్న కెవిన్ పీటర్సన్
వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ముగిసిన నాలుగు రోజులకే భారత్-ఆస్ట్రేలియా(IND-AUS) మధ్య టీ20 సిరీస్ ప్రారంభమైంది. ఈ ఐదు టీ20ల మ్యాచులో ప్రస్తుతం టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. వన్డే వరల్డ్ కప్ 2023 ముగిసిన వెంటనే భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ ఏర్పాటు చేయడంపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైక్ హాస్సీ (Mike Hussey) అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇలా వరుసగా టోర్నీలు నిర్వహిస్తే ఆటగాళ్లపై అదనపు ఒత్తిడి పడుతుందన్నారు. ప్రపంచ కప్ ఆడిన తర్వాత ఆటగాళ్లకు విరామం అవసరమని మైక్ హాస్సీ అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లతో ఎక్కువ మ్యాచులు ఆడేందుకు క్రికెట్ బోర్డులు ఇలాంటి షెడ్యూల్ రూపొందించడం సరికాదని చెప్పాడు.
భారత్ ఓడిపోవడంతో బెట్ పోయింది : కెవిన్ పీటర్సన్
వన్డే ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ ఆడిన తీరు అత్యంత అధ్వానంగా ఉందని ఆ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ (Kevin Peterson ) పేర్కొన్నారు. ఇక ఫైనల్ మ్యాచులో భారత జట్టు ఓడిపోవడంతో తన బెట్ కూడా పోయిందని పీటర్సన్ చెప్పాడు. టీమిండియా ఈ టోర్నీలో అద్భుత ఆటతీరును ప్రదర్శించినా దురదృష్టవశాత్తూ ఫైనల్లో ఓడిపోయిందన్నారు. భారత్ కప్పు గెలుస్తుందని బెట్ పెట్టానని, కానీ దాన్ని కోల్పోవాల్సి వచ్చిందన్నారు.