MS Dhoni : ధోనీ ఐపీఎల్ భవిష్యత్తుపై సీఎస్కే సీఈవో క్లారిటీ.. అక్టోబర్ 31న తేలనున్న సస్పెన్స్!
చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అంశంపై సీఈవో కాశీ విశ్వనాథన్ కీలక విషయాన్ని వెల్లడించారు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఐపీఎల్ భవిష్యత్తుపై అక్టోబర్ 31లోపు స్పష్టత ఇవ్వనున్నారని ఆయన స్పష్టం చేశారు. 2025 ఐపీఎల్ వేలం సమీపిస్తుండగా, రిటెన్షన్ గడువు దాదాపు ముగియనుంది. ధోనీ తదుపరి సీజన్‌లో ఆడతాడా లేదా అన్నది సందేహంగా మారింది. మూడు సీజన్లుగా ధోనీ తన చివరి ఐపీఎల్ ఆడుతున్నాడన్న వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇప్పుడు సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ ధోనీ తమ జట్టుకు ఆడాలని తాము కోరుకుంటున్నామని, కానీ అతను ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదన్నారు.
రూ.4 కోట్లకు రిటైన్ చేసుకొనే అవకాశం!
అక్టోబర్ 31 లోపు తన భవిష్యత్తు గురించి చెప్పనున్నట్లు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. ఎంఎస్ ధోని ఐపీఎల్‌లో కొనసాగడం కోసం అన్‌క్యాప్డ్ ప్లేయర్ నిబంధనను కూడా మారుస్తున్నారని గతంలో వార్తలు వచ్చాయి. ఐపీఎల్ పాలక మండలి, ఐదేళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా ఉన్న భారత క్రికెటర్లను అన్‌క్యాప్డ్ ప్లేయర్లుగా గుర్తించాలని నిర్ణయించటంతో, ఈ కొత్త నిబంధన ధోనీకి ప్రయోజనకరంగా మారింది. దీనివల్ల సీఎస్కే అతడిని కేవలం రూ.4 కోట్లకే రిటైన్ చేసుకునే అవకాశాన్ని పొందింది. 43 ఏళ్ల వయసులో తరచూ గాయాలతో ధోనీ ఇబ్బంది పడుతున్నాడు. ఇంకా ఐపీఎల్ కొనసాగగలడా అన్నది ప్రశ్నార్థకంగా ఉంది.