'హాల్ ఆఫ్ ఫేమ్'లో డయానా ఎడుల్జీ.. మహిళా క్రికెట్ స్థాయిని పెంచిందన్న ఝలన్ గోస్వామి
భారత మహిళ జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 'హాల్ ఆఫ్ ఫేమ్' లో చోటు దక్కించుకుంది. భారత్ నుంచి ఇప్పటివరకూ తొమ్మిది మందికి చోటు లభించగా, ఎడుల్జీ ఈ జాబితాలో చోటు దక్కించుకున్న తొలి భారత మహిళా క్రికెటర్‌గా చరిత్రకెక్కింది. అయా జట్లకు అందించిన సేవలు, నడిపించిన తీరు, గెలిపించిన ఘనతలను పరిగణలోకి తీసుకొని ఐసీసీ 'హాల్ ఆఫ్ ఫేమ్'లోకి ఎంపిక చేస్తారు. డయానా ఎడుల్జీకి ఈ అరుదైన దక్కడంపై మహిళా మాజీ క్రికెటర్ ఝలన్ గోస్వామి స్పందించింది. దేశంలో మహిళా క్రికెట్ స్థాయిని పెంచడంలో ఎడుల్జీ కృషి చేసిందని గోస్వామి ఝలన్ ప్రశంసించింది.
మహిళా క్రికెట్ కు మార్గదర్శకులుగా ఎడుల్జీ
దేశంలో మహిళల క్రికెట్‌కు చాలా గర్వకారణమని, మొత్తం భారతదేశానికి గర్వించదగిన క్షణమని, మహిళల క్రికెట్‌కు ఎడుల్జీ మార్గదర్శకులుగా ఉన్నారని గోస్వామి రాశారు. 1976 నుంచి 1993 వరకు భారత జట్టుకు ఆడి స్పిన్ ఆల్‌రౌండర్‌గా ఎడుల్జీ రాణించింది. 20 టెస్టులాడి 63 వికెట్లను పడగొట్టి, 404 పరుగులు చేసింది. ఇక 34 వన్డేల్లో 211 పరుగులు సాధించి 46 వికెట్లను తీసింది. హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఎడుల్జీతో పాటు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, శ్రీలంక దిగ్గజం అరవింద డిసిల్వాకు ఈ జాబితాలో చోటు లభించింది.