వన్డే వరల్డ్‌కప్ పాకిస్థాన్ ఆడకపోతే.. ఐసీసీ ఏం చేస్తుందో తెలుసా..?
భారత్ వేదికగా జరిగే ప్రపంచ కప్ 2023 కోసం షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. షెడ్యూల్ ఖరారు కావడంతో పాకిస్థాన్ జట్టు ఇండియాకు వస్తుందని అంతా భావించారు. కానీ అంతలోనే భారత్‌కి తమ జట్టు వచ్చేది రానిది పాక్ ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఆ దేశ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ ప్రభుత్వం అనుమతించకపోతే టోర్నీలో ఎలాంటి పరిణాలు చోటు చేసుకుంటాయో తెలుసుకుందాం. ఒకవేళ పాక్ ప్రభుత్వం తమ జట్టును భారత్ కు పంపకపోతే పాక్ టోర్నీలో పాల్గొనే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ విధించే శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది.
పాక్ స్థానంలో మరో జట్టును ఆడించే అవకాశం!
ప్రపంచ కప్ ఆడేందుకు పాకిస్థాన్ ఇండియాకు రాకపోతే చివరి క్షణంలో ఐసీసీ పాక్ స్థానంలో మరో జట్టును టోర్నీలో ఆడించే అవకాశం ఉంది. అయితే పాకిస్థాన్ స్థానంలో ఐసీసీ ఇతర దేశాన్ని చేర్చకూడదని భావిస్తే టోర్నమెంట్లో తొమ్మిది జట్లతోనే మ్యాచులు జరుగుతాయి. అలాగే పాకిస్థాన్‌తో మ్యాచులు ఆడాల్సిన జట్లకు ఆ మ్యాచ్ కోసం రెండు పాయింట్లను ఇస్తుంది. ఒకవేళ పాకిస్థాన్ జట్టు భారత్ కు రాకపోతే పాకిస్థాన్ లేకుండా ప్రపంచ కప్ ఆడడం ఇదే తొలిసారి అవుతుంది. 1992లో పాకిస్థాన్ జట్టు వరల్డ్ కప్ టోర్నీలో విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.