Page Loader
Azharuddin: అజారుద్దీన్ పేరును తొలగించొద్దు.. హెచ్‌సీఏకి హైకోర్టు క్లారిటీ!
అజారుద్దీన్ పేరును తొలగించొద్దు.. హెచ్‌సీఏకి హైకోర్టు క్లారిటీ!

Azharuddin: అజారుద్దీన్ పేరును తొలగించొద్దు.. హెచ్‌సీఏకి హైకోర్టు క్లారిటీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 30, 2025
11:47 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలతో ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్ వివాదం కొత్త మలుపు తిరిగింది. భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ పేరును ఆ స్టాండ్‌పై నుంచి తొలగించవద్దంటూ హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు ఈ వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు స్పష్టమైన సూచనలు చేసింది. ఈ వివాదం మొదలైన దాని నేపథ్యం చూస్తే - అజారుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్‌కు తన పేరును ఇవ్వడం వివాదాస్పదమైంది. దీనిపై లార్డ్స్ క్రికెట్ క్లబ్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్యకు ఫిర్యాదు చేసింది.

Details

హైకోర్టును అశ్రయించిన అజారుద్దీన్

విచారణ అనంతరం అజారుద్దీన్ ఈ నిర్ణయం ఏకపక్షంగా తీసుకున్నాడని పేర్కొంటూ, స్టాండ్ నుంచి ఆయన పేరు తొలగించాలని హెచ్‌సీఏను ఆదేశించారు. అలాగే టికెట్లపై కూడా 'అజారుద్దీన్ స్టాండ్' అనే పదం ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అజారుద్దీన్ హైకోర్టును ఆశ్రయించారు. తాను దేశానికి ప్రాతినిధ్యం వహించానని, కెప్టెన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించానని, స్టాండ్‌కు తన పేరు పెట్టిన ప్రక్రియ ఏకపక్షంగా జరగలేదని వాదించారు. ఈ వాదనలపై హైకోర్టు స్పందిస్తూ, అంబుడ్స్‌మన్ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.