Loading...
Donald Trump: ఫిఫా అధ్యక్షుడు యూఎన్ ప్రధాన కార్యదర్శి అవుతారా..? ట్రంప్ వ్యాఖ్యలతో చర్చ
ఫిఫా అధ్యక్షుడు యూఎన్ ప్రధాన కార్యదర్శి అవుతారా..? ట్రంప్ వ్యాఖ్యలతో చర్చ

Donald Trump: ఫిఫా అధ్యక్షుడు యూఎన్ ప్రధాన కార్యదర్శి అవుతారా..? ట్రంప్ వ్యాఖ్యలతో చర్చ

వ్రాసిన వారు Moogati Shabari
Jul 22, 2026
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

2026 ఫిఫా ప్రపంచకప్ విజయవంతంగా ముగిసిన అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీశాయి. ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో నాయకత్వ సామర్థ్యాన్ని ప్రశంసించిన ట్రంప్, ఆయన ఐక్యరాజ్యసమితి (యూఎన్) తదుపరి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టే అర్హత కలిగిన వ్యక్తి అని అభిప్రాయపడినట్లు సమాచారం. అయితే ట్రంప్ మద్దతు తెలిపినంత మాత్రాన ఇన్ఫాంటినో యూఎన్ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టడం సాధ్యం కాదు. ఆ పదవికి ఎంపిక కావాలంటే ముందుగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UN Security Council) ఆమోదం తప్పనిసరి.

వివరాలు

త్వరలోనే కొత్త ప్రధాన కార్యదర్శి ఎంపిక..

15 సభ్య దేశాలతో కూడిన ఈ మండలిలో మద్దతు లభించడంతో పాటు, శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా దేశాల్లో ఏ ఒక్కటి కూడా వీటో అధికారాన్ని వినియోగించకూడదు.

ఈ ఐదు దేశాల్లో ఏదైనా ఒకటి అభ్యంతరం వ్యక్తం చేస్తే అభ్యర్థిత్వం అక్కడికక్కడే నిలిచిపోతుంది.

భద్రతా మండలి ఆమోదించిన అభ్యర్థి పేరును అనంతరం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (General Assembly) తుది నిర్ణయం కోసం పరిశీలిస్తుంది.

ప్రస్తుతం యూఎన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆంటోనియో గుటెర్రెస్ పదవీకాలం ఈ ఏడాది డిసెంబరుతో ముగియనున్న నేపథ్యంలో, కొత్త ప్రధాన కార్యదర్శి ఎంపిక ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది.

వివరాలు

ఆ అంశంపై డొనాల్డ్ ట్రంప్‌తో అధికారికంగా చర్చలు..

ఇప్పటి వరకు జియానీ ఇన్ఫాంటినో ఈ పదవికి పోటీ చేయాలనే ఆసక్తిని వ్యక్తం చేసినట్లు గానీ, ఈ అంశంపై డొనాల్డ్ ట్రంప్‌తో అధికారికంగా చర్చలు జరిపినట్లు గానీ ఎలాంటి ధృవీకరణ వెలువడలేదు.

మరోవైపు, యూఎన్ ప్రధాన కార్యదర్శి పదవికి సంభావ్య అభ్యర్థుల జాబితాలో చిలీ మాజీ అధ్యక్షురాలు మిచెల్ బాచెలెట్‌తో పాటు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోస్సీ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ADVERTISEMENT

వివరాలు

అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం..

ఇదిలా ఉండగా, 2026 ఫిఫా ప్రపంచకప్ విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో భవిష్యత్తులో మరోసారి ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీని అమెరికాలో నిర్వహించాలని ట్రంప్ ఫిఫా అధికారులను కోరనున్నట్లు సమాచారం.

ఇటీవల ముగిసిన ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనాను ఓడించిన స్పెయిన్ ఛాంపియన్‌గా నిలిచింది.

విజేత జట్టుకు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ట్రోఫీని అందజేశారు. ఈ ప్రపంచకప్‌కు అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చాయి.

ADVERTISEMENT