
Ankit Kumar: 16 బంతుల్లో ఊచకోత.. గిల్ స్థానంలో తన జట్టుకు కెప్టెన్ కూడా కావొచ్చు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం టీమిండియా మ్యాచ్‌లు ఆడకపోయినా, దేశంలో అనేక లీగ్‌లు జరుగుతున్నాయి. వాటిలో ఢిల్లీలో జరుగుతున్న లీగ్ రెండో సీజన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇందులో ప్రియాంష్ ఆర్య, దిగ్వేష్ రాఠి వంటి IPLలో గుర్తింపు పొందిన ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు. ఈ సీజన్‌లో ఒక్కొక్క మ్యాచ్ అభిమానులను ఉత్సాహపరుస్తోంది. తాజాగా, ఒక బ్యాటర్ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. రాబోయే రోజుల్లో శుభమన్ గిల్ స్థానాన్ని భర్తీ చేస్తూ కెప్టెన్సీ అందుకోవచ్చని అంచనాలు ఉన్నాయి. అతనే హర్యానాకు చెందిన 27 ఏళ్ల అంకిత్ కుమార్. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) మ్యాచ్‌లో కేవలం 16 బంతుల్లోనే తుఫాను ఇన్నింగ్స్‌తో సంచలనం సృష్టించాడు.
వివరాలు
తూర్పు ఢిల్లీపై సుడిగాలి ఇన్నింగ్స్
DPLలో వెస్ట్ ఢిల్లీ లయన్స్ తరపున ఆడుతున్న అంకిత్ కుమార్, ఆగస్టు 10న ఈస్ట్ ఢిల్లీ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ముందు బ్యాటింగ్ చేసిన ఈస్ట్ ఢిల్లీ 158 పరుగులు చేసింది. అర్పిత్ రాణా వారిలో టాప్ స్కోరర్‌గా 71 పరుగులు చేశాడు. అనంతరం, లక్ష్య ఛేదనలో పవర్‌ప్లే నుంచే అంకిత్ దూకుడు ప్రదర్శించాడు. అంకిత్ 16 బంతుల్లో విధ్వంసం.. క్రిష్ యాదవ్‌తో కలిసి మొదటి వికెట్‌కు 4.3 ఓవర్లలోనే 63 పరుగుల భాగస్వామ్యం అందించాడు అంకిత్. అందులో 42 పరుగులు ఒక్కడే సాధించాడు.తొలి ఓవర్‌లోనే ఒక సిక్స్‌తో ప్రారంభించిన అతను,రెండో ఓవర్‌లో అసలైన విధ్వంసం ప్రారంభించాడు.
వివరాలు
ఇన్నింగ్స్ గణాంకాలు, జట్టు ఓటమి
అఖిల్ చౌదరి వేసిన ఆ ఓవర్‌లో వరుసగా 4 సిక్స్‌లు కొట్టి, ఒక్క ఓవర్‌లోనే 26 పరుగులు బాదేశాడు. అంకిత్ 16 బంతుల్లో 42 పరుగులు చేశాడు. ఇందులో 5 సిక్స్‌లు, 2 ఫోర్లు ఉన్నాయి. అయితే అతని అద్భుత ఆరంభాన్ని మిడిల్ ఆర్డర్ కొనసాగించలేకపోవడంతో, వెస్ట్ ఢిల్లీ 156 పరుగులకే ఆగిపోయింది. ఫలితంగా, ఈస్ట్ ఢిల్లీ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది.
వివరాలు
గిల్ గైర్హాజరీలో కెప్టెన్సీ అవకాశం
గత రంజీ సీజన్‌లో అంకిత్ హర్యానా తరపున అత్యధిక పరుగులు సాధించాడు. 14 ఇన్నింగ్స్‌ల్లో 59 సగటుతో 574 పరుగులు చేసి, తన ఫామ్‌ను నిరూపించాడు. ఈ ప్రదర్శన కారణంగా దులీప్ ట్రోఫీతో మొదలయ్యే కొత్త దేశీయ సీజన్‌లో నార్త్ జోన్ జట్టులో స్థానం సంపాదించాడు. అంతేకాక, అతనికి వైస్ కెప్టెన్ బాధ్యతలు కూడా అప్పగించారు. జట్టు కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ఆసియా కప్‌లో టీమిండియాకు ఎంపిక కావడం ఖాయమవడంతో, గిల్ గైర్హాజరీలో అంకిత్‌కు కెప్టెన్సీ చేసే అవకాశం దక్కనుంది.