Eden Gardens: ఈడెన్ గార్డెన్స్ మైదానంలో అగ్నిప్రమాదం.. ఎలా జరిగిందంటే?
ఇండియాలోని ప్రముఖ క్రికెట్ స్టేడియంలో ఒకటైన కోల్‌కతాలోని ఈడెన్ గార్డన్స్ మైదానంలో అగ్ని ప్రమాదం చోటు చేసుసుకుంది. మెగా టోర్నీ ప్రపంచ కప్ 2023 కోసం మరమ్మతు పనులు చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. బుధవారం రాత్రి ఈడెన్ గార్డెన్స్ డ్రెస్సింగ్ గదుల్లో ఈ మంటలు చెలరేగినట్లు తెలిసింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారమిచ్చారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న రెండు ఫైర్ ఇంజిన్లు మంటలను పూర్తిగా ఆర్పివేశాయి. విద్యుత్ పరికరాల్లో సమస్య కారణంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం.
డ్రెస్సింగ్ రూమ్‌లో చెలరేగిన మంటలు
ఈడెన్ గార్డెన్స్ మైదానం డ్రెస్సింగ్ రూమ్‌లోని ఫాల్స్ సీలింగ్‌లో మంటలు వ్యాపించినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో ఎక్కువ నష్టం జరగలేదని, ఆటగాళ్లకు చెందిన కొంత సామగ్రి కాలిపోయిందని సిబ్బంది తెలిపారు. ప్రపంచ కప్ 2023 కోసం ఈడెన్ గార్డెన్స్ మైదానంలో శరవేగంగా పనులు జరగుతున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 15 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పగలు, రాత్రి అనే తేడా లేకుండా పనులు జరగుతున్నాయి. హఠాత్తుగా మంటలు వ్యాపించడానికి గల కారణాలపై ఇప్పటికే అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇక్కడ జరుగుతున్న పనులపై ఐసీసీ ప్రతినిధులు ఇప్పటికే సంతృప్తి వ్యక్తం చేశారు.