Virat Kohli: భావోద్వేగాలను నియంత్రించుకోవాలి.. విరాట్ కోహ్లీకి బ్రాడ్ హాగ్ కీలక సూచన
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచారు. తొలి టెస్టులో వర్షం కారణంగా అతను ఇబ్బంది పడ్డాడనే అభిప్రాయం ఉంది. అయితే రెండో టెస్టులో కూడా అదే పరిస్థితి పునరావృతమైంది. కీలక సమయంలో వికెట్‌ను కోల్పోవడం, ముఖ్యంగా స్పిన్నర్ల చేతిలో ఔటవ్వడం అభిమానులను నిరాశ కలగించింది. ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్, కోహ్లీ తన భావోద్వేగాలను నియంత్రించుకోలేక పోతున్నాడని పేర్కొన్నారు. భారత జట్టు న్యూజిలాండ్‌ను తేలిగ్గా తీసుకున్నట్లుగా కనిపించిందని, రెండో టెస్టులో, కోహ్లీ దూకుడుగా బ్యాటింగ్ చేయాలని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందన్నారు.
చివరి టెస్టులో తప్పక గెలవాలి
స్పిన్ బౌలింగ్‌లో ఔట్ కావడం అనేది భావోద్వేగాల నియంత్రణలో లోపం ఉన్నట్టు సూచిస్తోందన్నారు. మూడో టెస్టులో కోహ్లీ తన టెక్నిక్‌ను మెరుగుపర్చుకోవాల్సి ఉందన్నారు. సౌథీ బౌలింగ్‌లో రోహిత్ శర్మ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, కాబట్టి వీరిద్దరూ బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాలన్నారు. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్, ఆస్ట్రేలియా జట్లు టాప్-2లో ఉన్నాయి. కివీస్‌తో చివరి మ్యాచ్‌లో ఓడితే టీమ్‌ఇండియా పరిస్థితి క్లిష్టంగా మారే అవకాశం ఉంది.