325 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్.. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు భారీ ఆధిక్యం
యాషెస్ రెండో టెస్టులోనూ ఇంగ్లండ్ బ్యాటర్లు తడబడ్డారు. లార్డ్స్ మైదానంలో రెండో రోజు ప్రదర్శించిన దూకుడును ఇంగ్లాండ్ మూడో రోజు కొనసాగించలేకపోయింది. ఆస్ట్రేలియా బౌలర్లు విజృంభించడంతో రెండు టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 325 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్ (98) త్రుటీలో సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. హ్యారీ బ్రూక్ అర్ధ సెంచరీతో రాణించాడు. జాన్ క్రాలీ(48), ఓలి పోప్(42) ఫర్వాలేదనిపించగా, జో రూట్ (10), బెన్ స్టోక్స్(17), బెయిర్ స్టో (16) లు దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీసి చెలరేగిపోయాడు.
నిరాశపరిచన ఇంగ్లండ్ బ్యాటర్లు
ఇక స్పిన్నర్ ట్రావిస్ హెడ్, జోష్ హేజిల్ వుడ్ రెండేసి వికెట్లతో ఇంగ్లండ్‌ను కట్టడి చేశారు. కమిన్స్, లియోన్, గ్రీన్ తలా ఓ వికెట్ తీశారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 91 పరుగుల అధిక్యంలో నిలిచింది. ఓవర్ నైట్ స్కోరు 278/4తో మూడో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ కు ఆరంభంలో షాక్ తగిలింది. హాఫ్ సెంచరీతో ఫామ్ లో ఉన్న బ్రూక్ ను స్కార్ట్ ఔట్ చేశాడు. ఆ కొద్ది సేపటికే కెప్టెన్ బెన్ స్టోక్స్ (17)ఒక్క పరుగు చేయకుండానే వెనుదిరిగాడు. ఇక జోష్ టంగ్ ను పాట్ కమిన్స్ ఔట్ చేయడంతో 325 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్ లో ఆసీస్ 416 పరుగులు చేసిన విషయం తెలిసిందే.