యాషెష్ చివరి టెస్టులో ఇంగ్లాండ్ అద్వితీయ విజయం.. స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌కు ఘనంగా వీడ్కోలు
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య హోరా హోరీగా సాగే క్రికెట్ సమరం యాషెస్ లోని ఐదో మ్యాచ్ ను ఇంగ్లీష్ జట్టు విజయంతో ముగించింది. ప్రతిష్టాత్మకమైన యాషెస్ టెస్ట్ సిరీస్ 2023లో చివరి మ్యాచ్ సోమవారం ముగిసింది. ఈ మేరకు ఆస్ట్రేలియాపై 49 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టు అద్వితీయమైన విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే సిరీస్‌ను 2-2తో సమం చేసింది. వర్షంతో వరుణుడు ఆటంకాలు సృష్టించినా ఇరు జట్లు శక్తివంచన లేకుండా విజయం కోసం చివర వరకు పోరాడాయి. చివరి టెస్టులో గెలుపొందిన ఇంగ్లాండ్, ఆ జట్టు స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ కు ఘనంగా వీడ్కోలు పలికింది. ఆట చివరిరోజు చివరి 2 వికెట్లు పడగొట్టి జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని చేకూర్చాడు.
334 పరుగులకే కంగారులను కట్టడి చేసిన ఇంగ్లాండ్
384 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారులను ఆదిలోనే ఇంగ్లీష్ బౌలర్లు ఒత్తిడిలోకి నెట్టేశారు. ఓ వైపు వికెట్ నష్టపోకుండా 135 రన్స్ తో చివరి రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా 249 పరుగులు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆధిపత్యం ప్రదర్శించిన ఇంగ్లండ్ బౌలర్లు జట్టుకు గెలుపును అందించారు. ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 283 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 295 పరుగులు చేసి 12 రన్స్ ఆధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 395 పరుగులు చేసింది. ఈ మేరకు 384 పరుగుల లక్ష్యాన్ని చేజ్ చేసిన ఆసీస్ 334 పరుగులకే చేతులెత్తేసింది. గత సిరీస్ ను ఆస్ట్రేలియా గెలవడంతో ట్రోఫీ కంగారుల దేశంలోనే కొనసాగనుంది.