సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ప్రక్షాళన.. భారంగా మారిన ఆటగాళ్లపై వేటుకు సర్వం సిద్ధం
గత కొన్ని సీజన్ల నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటతీరు మరీ తీసికట్టుగా ఉంటోంది.ఈ మేరకు ప్రేక్షకులతో పాటు అభిమానుల అంచనాలను అందుకోవడంలో ఆ జట్టు పూర్తిగా చేతులెత్తేస్తోంది. గతంలో ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టు ప్రస్తుతం పేలవ ప్రదర్శనకు నిదర్శనంగా మారింది. ఈ క్రమంలోనే సరిగ్గా ఆడని ఆటగాళ్లకు గుడ్ బై చెప్పేందుకు యాజమాన్యం కార్యచరణకు దిగినట్లు సమాచారం. ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్ (రూ.8 కోట్లు) ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జట్టు ఎప్పుడు గెలుస్తుందో, ఎప్పుడు ఓటమి పాలవుతుందో తెలియని పరిస్థితి. అయితే కెప్టెన్లను మార్చినా ప్రయోజనం శూన్యంగానే ఉంటోంది. వేలంలో డబ్బు పొదుపుగా ఖర్చు పెడుతుందని సన్ రైజర్స్ ఇప్పటికే కీర్తి గడించింది.
ఐపీఎల్ మినీ వేలంలో ఆయా ఆటగాళ్లకు స్వస్తి పలకనున్న సన్ రైజర్స్ యాజమాన్యం
ఆల్ రౌండర్లను కొనుగోలు విషయంలో ఉదాసీనత వల్లే హైదరాబాద్ జట్టుకు ఐపీఎల్ లో కష్టాలు తప్పట్లేదని అంతా భావిస్తున్నారు. గత సీజన్ లో రూ.13.25 కోట్లతో ఇంగ్లండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ ను కొనుగోలు చేసింది. ఒక్క సెంచరీ మినహాయించి మిగతా మ్యాచ్ ల్లో ఎక్కడా ప్రభావం చూపించలేకపోయాడు. బ్రూక్ సహా జట్టుకు చాలా మంది ఆటగాళ్లు భారంగా మారారు. 2023 డిసెంబరులో ఐపీఎల్ మినీ వేలం నిర్వహణకు బీసీసీఐ సన్నద్ధమవుతోంది.ఇందులో భాగంగానేఆయా ఆటగాళ్లకు స్వస్తి పలకాలన్నది యాజమాన్యం ఉద్దేశంగా అర్థమవుతోంది. జట్టును పక్కా వ్యూహాలతో నడిపించాల్సిన బాధ్యత కోచ్ పైనే ఉంటుంది. ఈ మేరకు బ్యాటింగ్ లెజెండ్ బ్రియాన్ లారా దారుణంగా విఫలమయ్యారు. ప్రక్షాళనలో వేటు లారా నుంచే ప్రారంభించనున్నారని సమాచారం.