Anura Kumara Dissanayake: విదేశాంగ విధానంలో భారత్, చైనాల పట్ల సమాన వైఖరి.. శ్రీలంక అధ్యక్షుడు
భారత్, చైనా వంటి దేశాలతో విదేశాంగ విధానంలో సమానమైన వైఖరిని పాటించనున్నట్లు శ్రీలంక నూతన అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే తెలిపారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన ఈ విషయంలో తొలిసారి స్పందించారు. భారత్, చైనాల మధ్య నలిగిపోయే ఉద్ధేశం తమకు లేదని స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన పొరుగుదేశాలతో విదేశాంగ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ నాయకత్వంలో, దేశం భౌగోళిక, రాజకీయ ప్రత్యర్థుల జోలికి వెళ్లకుండా చూసుకుంటామని, నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పీపీ) ప్రభుత్వం ఎలాంటి దేశంతోనైనా ప్రత్యేక ఒప్పందం కాదని సూచించారు.
భారత్, చైనాల మధ్య నలిగిపోవాలనే ఉద్దేశం లేదు
భారతదేశం, చైనా రెండు దేశాలతో సమతుల్య సంబంధాలను పెంపొందించుకోవాలని భావిస్తోంది. తాము భౌగోళిక, రాజకీయ పోరాటంలో ఎవరితోనూ పోటీ పడడం లేదని చెప్పారు. ముఖ్యంగా భారత్, చైనాల మధ్య నలిగిపోవాలని తాము అనుకోవడం లేదని, ఈ రెండు దేశాలు తమ ప్రభుత్వానికి విలువైన స్నేహితులు, భాగస్వాములుగా ఉండాలని ఆశిస్తున్నామన్నారు. యూరోపియన్ యూనియన్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాతో కూడా సంబంధాలను కొనసాగిస్తామని ఆయన వివరించారు. ఇరుదేశాలతో పరస్పర ప్రయోజనకరమైన దౌత్య భాగస్వామ్యం నిర్మించడంపై శ్రీలంక దృష్టి సారించింది. పొరుగుదేశాల ఆధిపత్య పోరులో నలిగిపోకుండా తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో తటస్థ విదేశాంగ విధానం కీలకమని భావిస్తోంది.