FIFA World Cup: గోల్ కోసం గర్జన.. కప్పు కోసం కసరత్తు!
ఈ వార్తాకథనం ఏంటి
ఫుట్ బాల్ అభిమానుల కోసం మరో మహోత్సవం ఆరంభమైంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా ప్రపంచకప్ సందడి మొదలైంది. ప్రతి కిక్, ప్రతి పాస్, ప్రతి గోల్‌తో ఉత్కంఠ రేపే ఈ టోర్నీ అభిమానులకు అపారమైన వినోదాన్ని అందించనుంది. నేటి నుంచి 2026 ఫిఫా ప్రపంచకప్ పోటీలు ప్రారంభం కానున్నాయి. సాకర్ ప్రపంచంలోని దిగ్గజాలు లియోనెల్ మెస్సి, క్రిస్టియానో రొనాల్డోతో పాటు యువ సంచలనాలు లామిన్ యమాల్, వారెన్ జైర్ ఎమెరీ కూడా ఈ మెగా టోర్నీకి సిద్ధమయ్యారు. స్పెయిన్, అర్జెంటీనా, ఫ్రాన్స్ వంటి జట్లు టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తుండగా, దాదాపు నెలన్నర పాటు ఫుట్‌బాల్ పండుగ కొనసాగనుంది.
వివరాలు
సాకర్ సంబరాలకు శ్రీకారం..
ప్రపంచకప్ గురువారం అర్ధరాత్రి ఘనంగా ప్రారంభం కానుంది. మెక్సికో సిటీలో జరిగే తొలి మ్యాచ్‌లో (గ్రూప్-ఎ) మెక్సికో జట్టు దక్షిణాఫ్రికాను ఎదుర్కొంటుంది.
అదే గ్రూప్‌లో శుక్రవారం ఉదయం 7.30 గంటలకు జరిగే మరో మ్యాచ్‌లో చెకియా, దక్షిణ కొరియాతో తలపడనుంది.
డిఫెండింగ్ ఛాంపియన్‌గా అర్జెంటీనా బరిలోకి దిగుతున్న టోర్నీలో మొత్తం 48 జట్లు పాల్గొంటున్నాయి.
తొలి మ్యాచ్‌కు ముందు మెక్సికోలో వైభవంగా ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలో ప్రముఖ పాప్ గాయని షకీరా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
అమెరికా, కెనడాల్లో ప్రత్యేక ప్రారంభోత్సవాలు జరుగుతాయి. కెనడాలో జరిగే వేడుకల్లో బాలీవుడ్ నటి నోరా ఫతేహి తన ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించనుంది.
వివరాలు
ఏ దేశాల్లో.. ఏ నగరాల్లో?
ఈసారి ప్రపంచకప్ పోటీలు మూడు దేశాల్లోని 16 నగరాల్లో నిర్వహించనున్నారు.
కెనడా: టొరంటో, వాంకోవర్
మెక్సికో: గ్వాదలహారా, మెక్సికో సిటీ, మాంటెరే
అమెరికా: అట్లాంటా, బోస్టన్, డల్లాస్, హ్యూస్టన్, కాన్సాస్ సిటీ, లాస్ ఏంజెలెస్, మయామి, న్యూయార్క్-న్యూజెర్సీ, ఫిలడెల్ఫియా, సియాటిల్, శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా
అత్యధికంగా 78 మ్యాచ్‌లు అమెరికాలో జరగనున్నాయి. మెక్సికో, కెనడాలకు చెరో 13 మ్యాచ్‌లు కేటాయించారు.
క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్‌తో పాటు ఫైనల్ మ్యాచ్ కూడా అమెరికాలోనే నిర్వహించనున్నారు.
వివరాలు
టోర్నీ నిర్వహణ విధానం ఇదే..
48 జట్లను నాలుగు జట్ల చొప్పున ఎ నుంచి ఎల్ వరకు మొత్తం 12 గ్రూపులుగా విభజించారు.
ప్రతి గ్రూపులోని జట్టు మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది.
గ్రూప్ దశ ముగిసే సరికి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి.
అదనంగా మూడో స్థానంలో నిలిచిన జట్లలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఎనిమిది జట్లు కూడా తదుపరి దశకు చేరుకుంటాయి.
విజయం సాధించిన జట్టుకు మూడు పాయింట్లు, మ్యాచ్ డ్రా అయితే ఒక్కో జట్టుకు ఒక పాయింట్ లభిస్తుంది.
వివరాలు
టైటిల్‌పై కన్నేసిన అగ్ర జట్లు..
ప్రపంచకప్ చరిత్రను పరిశీలిస్తే ఇప్పటివరకు కేవలం ఎనిమిది దేశాలు మాత్రమే విజేతలుగా నిలిచాయి.
బ్రెజిల్, జర్మనీ, ఇటలీ, అర్జెంటీనా, ఫ్రాన్స్, ఉరుగ్వే, ఇంగ్లాండ్, స్పెయిన్ ఈ ఘనతను అందుకున్నాయి.
అయితే ఈసారి ఇటలీ టోర్నీకి అర్హత సాధించలేదు. మిగతా మాజీ ఛాంపియన్లు అందరూ బలమైన పోటీదారులుగానే కనిపిస్తున్నప్పటికీ, స్పెయిన్, ఫ్రాన్స్‌లను ప్రధాన ఫేవరెట్లుగా భావిస్తున్నారు.
ముఖ్యంగా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న స్పెయిన్‌పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.
18 ఏళ్ల యువ సంచలనం లామిన్ యమాల్ ఆ జట్టుకు అదనపు బలంగా మారాడు.
ఫలితంగా బెట్టింగ్ మార్కెట్‌లో కూడా స్పెయిన్‌కే అధిక మద్దతు లభిస్తోంది.
వివరాలు
మెస్సి - రొనాల్డోపై అందరి చూపు..
ప్రస్తుత తరం ఫుట్‌బాల్‌లో అత్యుత్తమ ఆటగాడు ఎవరనే చర్చ వస్తే అభిమానులు రెండు వర్గాలుగా విడిపోతారు.
అయితే లియోనెల్ మెస్సి, క్రిస్టియానో రొనాల్డో మైదానంలో చూపించే మాయాజాలానికి మాత్రం అందరూ ఒకేలా మంత్రముగ్ధులవుతారు.
అభిమానుల దృష్టి ఈ ఇద్దరు దిగ్గజాలపైనే నిలిచింది. రికార్డు స్థాయిలో ఆరో ప్రపంచకప్‌లో ఆడుతున్న మెస్సి, రొనాల్డో మరోసారి తమ ప్రతిభతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.
అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో గణాంకాల పరంగా కూడా ఇద్దరూ దాదాపు సమాన స్థాయిలో నిలిచారు.
మెస్సి తన దేశం తరఫున 199 మ్యాచ్‌లు ఆడి 117 గోల్స్ సాధించగా, రొనాల్డో 227 మ్యాచ్‌ల్లో 143 గోల్స్ నమోదు చేశాడు.
ఇద్దరూ తమ తమ జాతీయ జట్ల తరఫున చెరో 10 హ్యాట్రిక్‌లు సాధించారు.