Page Loader
Gautam Gambhir: విదేశీ పర్యటన అంటే హాలీడేలు కాదు.. బీసీసీఐ నిబంధనలపై గంభీర్ క్లారిటీ!
విదేశీ పర్యటన అంటే హాలీడేలు కాదు.. బీసీసీఐ నిబంధనలపై గంభీర్ క్లారిటీ!

Gautam Gambhir: విదేశీ పర్యటన అంటే హాలీడేలు కాదు.. బీసీసీఐ నిబంధనలపై గంభీర్ క్లారిటీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 11, 2025
03:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు సంబంధించి బీసీసీఐ (BCCI) తీసుకున్న కొత్త నిబంధనలపై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు. గత ఆసీస్ పర్యటనలో భారత జట్టు విఫలమైన తర్వాత బీసీసీఐ ఆటగాళ్లు, సిబ్బంది విషయంలో కఠినమైన మార్గదర్శకాలను అమలు చేసింది. ముఖ్యంగా విదేశీ పర్యటనల్లో కుటుంబ సభ్యులు జట్టుతో కలిసి ప్రయాణించకూడదన్న నిర్ణయం తీసుకోవడం ప్రముఖ అంశంగా నిలిచింది. ఈ నిబంధనల వల్ల కుటుంబానికి కేటాయించే సమయం తగ్గుతుందన్న కారణంగా అప్పట్లో విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. ఇదే కారణంగా అతడి టెస్టు కెరీర్‌కి త్వరిత ముగింపు వచ్చిందన్న ఊహాగానాలు అప్పటి నుంచి ఉన్నాయి.

Details

దేశం కోసం ఆడడమే ప్రధాన లక్ష్యం

ఇప్పుడు ఇదే అంశంపై గౌతమ్ గంభీర్ స్పందిస్తూ, "ప్రతి ఒక్కరికీ కుటుంబం ముఖ్యం. కానీ మనం ఇక్కడికి హాలీడే కోసం రాలేదు.దేశాన్ని గర్వపడేలా చేయాలన్న సంకల్పంతో మేం వేదికపైకి అడుగుపెడుతున్నాం. డ్రెస్సింగ్ రూమ్‌లో పరిమితమై ఉన్న వ్యక్తులతో కలిసి పనిచేసి విజయం సాధించాలి. నాకు వ్యతిరేకత లేదు కుటుంబంతో సమయం గడపడానికి. కానీ ఒకసారి పర్యటన మొదలయితే ఆ దృష్టి అంతా మ్యాచ్‌పై ఉండాలి. దేశం కోసం ఆడడమే ప్రధాన లక్ష్యం. ఇప్పుడున్న పద్ధతి నాకు సరిగ్గా అనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ఇక ఛతేశ్వర్ పుజారాతో ముఖాముఖిలో మాట్లాడిన గంభీర్, విజయం వెనుక ప్రతి ఒక్కరి అవసరమన్నారు. ఇక్కడ గంభీర్ ముఖ్యం కాదు, భారత క్రికెట్ ముఖ్యం.నిత్యం పోటీలో ఉంటూ విజయం కోసం ప్రయత్నించాల్సిందే.

Details

నిబంధనలు క్రమశిక్షణను పెంచడానికి సాయపడతాయి

మూడు రంగుల జెండా కోసం ప్రాతినిధ్యం వహిస్తున్నామంటే దానికి సరిపోయే నిబద్ధత ఉండాలి. నేను ఎప్పుడూ నా ప్లేయర్స్ అభిప్రాయాలను గౌరవిస్తాను. డ్రెస్సింగ్ రూమ్ కల్చర్‌లో ఓపెన్ డైలాగ్ అనేది చాలా ముఖ్యం. విజయం వెనుక కుటుంబాల సహకారం కూడా తక్కువ కాదని అన్నారు. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు గంభీర్ తల్లి అనారోగ్యం కారణంగా స్వదేశానికి వచ్చి, మళ్లీ జట్టుతో చేరిన విషయం తెలిసిందే. ఈ సంఘటన ద్వారా బీసీసీఐ నియమాలను పాటిస్తూ బాధ్యత చూపినట్లు గంభీర్ నిరూపించాడు. మొత్తంగా, బీసీసీఐ నిబంధనలు జట్టులో క్రమశిక్షణ పెంచడంలో సహాయపడతాయని గంభీర్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.