Vaibhav Suryavanshi : రంజీ ట్రోఫీ నుంచి ఐపీఎల్ వరకు.. సంచలనం సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ ఎంతోమంది యువ క్రికెటర్లకు ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా నిలుస్తోంది. ఈ సీజన్‌లో ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న టీనేజ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ.
రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ 13 ఏళ్ల ఆటగాడిని రూ.1.10 కోట్లకు కొనుగోలు చేయడం క్రికెట్ వర్గాల్లో సంచలనం సృష్టించింది.
అండర్-19, దేశవాళీ క్రికెట్‌లో తన దూకుడైన ఆటతో ఇప్పటికే క్రీడాభిమానులను ఆకర్షించిన ఈ కుర్రాడు ఐపీఎల్‌లో తన ప్రతిభను ఎంతవరకు చూపగలడో ఆసక్తిగా మారింది.
Details
నాలుగేళ్లకే బ్యాట్ పట్టిన సూర్యవంశీ
బిహార్‌లోని తాజ్‌పూర్ గ్రామానికి చెందిన వైభవ్ కేవలం నాలుగేళ్ల వయసులోనే బ్యాట్ పట్టాడు. తొమ్మిదేళ్లకే ప్రొఫెషనల్ క్రికెట్ ఆడడం ప్రారంభించాడు.
అతడి మొదటి కోచ్ అతని తండ్రి సంజీవ్ సూర్యవంశీ. కుమారుడి క్రికెట్ కల నెరవేర్చేందుకు సంజీవ్ సొంత పొలాన్ని అమ్మేశారు.
తండ్రి చేసిన త్యాగాన్ని మరచిపోకుండా, అంకితభావంతో ముందుకెళ్తూ తన ప్రతిభను నిరూపించుకుంటున్నాడు.
Details
పవర్ హిట్టర్ - సొగసైన షాట్లు
లెఫ్ట్-హ్యాండ్ బ్యాట్స్‌మన్ అయిన వైభవ్ తన పవర్ హిట్టింగ్ వల్ల విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. అతని బ్యాటింగ్ శైలి పృథ్వీ షా, శిఖర్ ధావన్‌లను తలపించేలా ఉంటుంది.
స్క్వేర్ డ్రైవ్, డీప్ మిడ్-వికెట్ పై పుల్ షాట్లు, క్లాసిక్ కవర్ డ్రైవ్ లాంటి అస్త్రాలతో ప్రత్యర్థి బౌలర్లపై చెమటలు పట్టిస్తాడు.
ఆసీస్ అండర్-19 జట్టుపై 62 బంతుల్లో 104 పరుగులు చేసి రెండో అతివేగవంతమైన సెంచరీ సాధించాడు.
2024 విజయ్ హజారే ట్రోఫీలో 42 బంతుల్లోనే 71 పరుగులు చేసి లిస్ట్-ఎ క్రికెట్‌లో అతి పిన్న వయసులో అర్ధశతకం బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
బ్యాటింగ్‌తో పాటు లెఫ్ట్-ఆర్మ్ లెగ్ స్పిన్ బౌలింగ్ చేయగల నైపుణ్యం కూడా అతనికి ఉంది.
Details
చరిత్ర సృష్టించిన వైభవ్
వైభవ్ సూర్యవంశీ కేవలం 12 ఏళ్ల వయసులో బిహార్ తరఫున రంజీ ట్రోఫీలో ఆడాడు.
అత్యంత పిన్న వయసులో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఆటగాళ్లలో సచిన్ తెందుల్కర్, యువరాజ్ సింగ్‌ల రికార్డును అధిగమించాడు.
2024లో ముంబయి, ఛత్తీస్‌గఢ్ జట్లతో జరిగిన రెండు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 31 పరుగులు చేశాడు. రంజీకి ముందు ఇండియా బీ తరఫున అండర్-19 క్వాడ్రాంగులర్ టోర్నమెంట్‌లో ఆడాడు.
ఆరు ఇన్నింగ్స్‌ల్లో 177 పరుగులు సాధించి, రెండు అర్ధశతకాలు సాధించాడు. వినూ మన్కడ్ ట్రోఫీలోనూ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు.
ఐదు మ్యాచ్‌ల్లో 78.60 సగటుతో 393 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఎనిమిదో స్థానంలో నిలిచాడు.
Details
రాజస్థాన్ రాయల్స్ వ్యూహం
రాజస్థాన్ రాయల్స్ యువ ప్రతిభను గుర్తించే జట్టుగా పేరుపొందింది. యశస్వీ జైస్వాల్, సంజు శాంసన్‌లాంటి అనుభవజ్ఞులున్న ఈ జట్టులో వైభవ్‌కు తక్షణమే అవకాశం రాకపోవచ్చు.
అయితే భవిష్యత్తులో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం లభించే అవకాశం ఉంది.
యువ ఆటగాళ్లలో దూకుడైన ఆటతీరును ప్రోత్సహించే రాజస్థాన్ రాయల్స్ వైభవ్‌ను భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా తీసుకుంది.
రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజ కోచ్ పర్యవేక్షణలో ఉండటంతో, అతను తన నైపుణ్యాన్ని మెరుగుపర్చుకొని మేటి క్రికెటర్‌గా ఎదిగే అవకాశముంది.
Details
భవిష్యత్తులో భారత జట్టు ఆశాకిరణం
దేశవాళీ క్రికెట్‌లో తన సత్తా చాటిన వైభవ్, అండర్-19లోనూ తన ప్రతిభను నిరూపించుకున్నాడు.
అదే స్థాయిలో నిలకడగా రాణిస్తే, భారత జట్టులో ఒక సంచలన బ్యాట్స్‌మన్‌గా ఎదిగే అవకాశం ఉన్నటుందనడం అతిశయోక్తి కాదు.
13 ఏళ్లకే ఐపీఎల్‌కు ఎంపికైన ఈ టీనేజర్ భవిష్యత్తులో భారత క్రికెట్‌లో సరికొత్త సంచలనం సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాడు!