IPL 2025 TELUGU CRICKETERS: ఐపీఎల్ 2025 మెగా వేలంలో అమ్ముడుపోయిన తెలుగు క్రికెటర్ల రికార్డ్స్ ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. ఆటగాళ్ల ప్రతిభను పరిగణనలోకి తీసుకొని, ఫ్రాంఛైజీలు వారి పై భారీగా డబ్బును ఖర్చు చేశాయి.
పేరులేని కొంత మంది యువ క్రికెటర్లు ఆశ్చర్యకరమైన ధరకు అమ్ముడై, క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు.
వారిలో కొంత మంది క్రీడాకారులు కోటీశ్వరులయ్యారు. ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో ముగ్గురు తెలుగు కుర్రాళ్లకు సైతం అవకాశం లభించింది.
వివరాలు
IPL 2025 - సత్యనారాయణ రాజు
కాకినాడకు చెందిన ఫాస్ట్ బౌలర్ సత్యనారాయణ రాజు రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలో పాల్గొన్నాడు.
అతడిని ముంబయి ఇండియన్స్ కనీస ధరకే కొనుగోలు చేసింది. ఈ ఏడాది రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన సత్యనారాయణ, ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే వన్డే టోర్నీలో అదరగొట్టాడు.
అతడి ప్రతిభను గుర్తించిన ముంబయి ఇండియన్స్ అతడిని తమ జట్టులో చేర్చుకుంది.
ఇదే జట్టులో హైదరాబాద్ యువ ఆటగాడు తిలక్ వర్మ కూడా ఉన్నాడు, అతడిని ముంబయి జట్టు రూ.8 కోట్లకు రిటైన్ చేసుకుంది.
వివరాలు
IPL 2025 - త్రిపురణ విజయ్
శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన త్రిపురణ విజయ్ ఐపీఎల్ 2025 వేలంలో దిల్లీ క్యాపిటల్స్ ద్వారా చోటు దక్కించుకున్నాడు.
దేశవాళీ క్రికెట్‌లో స్థిరంగా రాణిస్తున్న విజయ్, ఆఫ్-స్పిన్ ఆల్‌రౌండర్‌గా తన ప్రతిభను ప్రదర్శించాడు.
అతడిని దిల్లీ జట్టు రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 16 వికెట్లు, 150 పరుగులు సాధించిన విజయ్, రంజీ ట్రోఫీ, కూచ్ బెహార్ ట్రోఫీల్లోనూ మెరిశాడు.
ప్రస్తుతం ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు.
వివరాలు
IPL 2025 - పైలా అవినాశ్
విశాఖపట్నం అనకాపల్లి జిల్లా దోసూరు గ్రామానికి చెందిన పైలా అవినాశ్, ఈసారి ఐపీఎల్ అవకాశాన్ని అందుకున్నాడు.
రూ.30 లక్షల కనీస ధరకు పంజాబ్ కింగ్స్ అతడిని కొనుగోలు చేసింది.
ఓ ఎలక్ట్రీషియన్ కుమారుడైన అవినాశ్, క్లబ్ క్రికెట్‌తో పాటు ఈనాడు క్రికెట్ టోర్నీలోనూ అద్భుతంగా ఆడాడు.
అనంతరం ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో ఆకట్టుకున్నాడు. ఆ లీగ్‌లో ఓ మ్యాచ్‌లో 58 బంతుల్లో 105 పరుగులు చేసి హిట్టర్‌గా గుర్తింపు పొందాడు.
దీంతో పంజాబ్ కింగ్స్ అతడిని తమ జట్టులోకి తీసుకుంది.
వివరాలు
IPL 2025 - షేక్ రషీద్
గుంటూరు జిల్లా యువ క్రికెటర్ షేక్ రషీద్, క్రికెట్ అభిమానులకు సుపరిచితుడే.
2022 అండర్-19 వరల్డ్ కప్‌లో భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన రషీద్, సెమీఫైనల్, ఫైనల్లో అద్భుతంగా రాణించి జట్టును విజేతగా నిలిపేందుకు కీలకపాత్ర పోషించాడు.
అతడిని గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. కానీ తుది జట్టులో అతడికి చోటు రాలేదు.
అయినప్పటికీ, సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా స్టన్నింగ్ క్యాచ్‌లతో ఆకట్టుకున్నాడు.
ఈసారి మెగా వేలం ముందు చెన్నై సూపర్ కింగ్స్ అతడిని విడుదల చేసింది, కానీ మళ్లీ వేలంలో రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది.
ఈ సీజన్‌లో అతడికి ఆడే అవకాశం వస్తుందా, వచ్చి ఎలా రాణిస్తాడో చూడాలి.
వివరాలు
తెలుగు క్రికెటర్ల ఐపీఎల్ ప్రస్థానం
ఐపీఎల్ 2025 మెగా వేలంలో మొత్తం ఐదుగురు తెలుగు ఆటగాళ్లు అమ్ముడుపోయారు.
టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను గుజరాత్ టైటాన్స్ రూ.12.25 కోట్లకు కొనుగోలు చేసింది.
మరో తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి, గత ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.6 కోట్లకు రిటైన్ చేసుకుంది. ప్రస్తుతం అతడు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రాణిస్తున్నాడు.
వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు
ఈసారి ఐపీఎల్ వేలంలో కేఎస్ భరత్, బైలపూడి యశ్వంత్,సిరిసిల్లకు చెందిన ఆరవెల్లి అవనీశ్ అమ్ముడుపోలేదు.
ఏ ఫ్రాంఛైజీ కూడా వీరిని కొనుగోలు చేయకపోవడంతో వారికి నిరాశ ఎదురైంది.మొత్తంగా,ఈసారి ఐపీఎల్ 2025 వేలంలో తెలుగు ఆటగాళ్లకు మంచి అవకాశాలు లభించాయి. వీరు తమ ప్రదర్శనతో జట్ల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటారో లేదో చూడాలి.