Anil Kumble: సీనియర్ల భవిష్యత్తుపై గంభీర్ కీలక నిర్ణయాలు తీసుకోక తప్పదు
ఈ వార్తాకథనం ఏంటి
భారత జట్టు భవిష్యత్తు కోసం మార్పులు చేసే క్రమంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే సూచించాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయని ఆయన వ్యాఖ్యానించాడు.
సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ వంటి ఆటగాళ్ల భవిష్యత్తుపై కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అయితే అన్నీ సజావుగా సాగేలా చూడాల్సిన బాధ్యత గంభీర్‌పైనే ఉంటుందని కుంబ్లే అభిప్రాయపడ్డాడు.
Details
మార్పులు అనివార్యమైనవి
'భారత ప్రధాన కోచ్‌గా గంభీర్‌కు ఇది అత్యంత కీలకమైన టోర్నీ. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం అతను అనేక కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
స్టార్ ఆటగాళ్ల వారసత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. అయితే, మార్పులు అనివార్యమైనవి. ఈ టోర్నమెంట్ తర్వాత సీనియర్ల భవిష్యత్తుపై స్పష్టత రానుంది.
ఏ స్థానాల్లో మార్పులు చేయాలనే విషయంలో ఓ అవగాహన వస్తుంది. గెలుపోటములకతీతంగా మార్పులు తప్పవు. ప్రపంచకప్ 2027 మెగా టోర్నీకి ఇప్పటి నుంచే సిద్ధం కావాలి.
దానికి తగ్గట్టుగా యువ క్రికెటర్లను ఎంపిక చేయడం అవసరం. ప్రతి ఒక్కరికీ కనీసం 20 మ్యాచుల్లో ఆడే అవకాశం కల్పించాలి. అప్పుడే వాళ్లు అంతర్జాతీయ స్థాయికి అలవాటు పడతారని అనిల్ కుంబ్లే పేర్కొన్నాడు.
Details
సీనియర్ల భవిష్యత్తు ఏమిటి?
ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం సీనియర్లను కొనసాగించాలా? లేక యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలా? అనే విషయాన్ని కోచ్, టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించాల్సి ఉంటుందని కుంబ్లే అభిప్రాయపడ్డాడు.
గంభీర్ ఈ అంశంపై స్పష్టత ఇచ్చే అవసరం ఉందని, టీ20ల్లో ప్రస్తుతం భారత జట్టు బలంగా ఉందని, సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో మెరుగైన ప్రదర్శన చేస్తోందని కుంబ్లే పేర్కొన్నాడు.
వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ జరగనుండగా, వన్డే ప్రపంచకప్ 2027కు ఇంకా రెండేళ్లు సమయం ఉందన్నారు. ఆ లోగా యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని సూచించారు.
నిలకడగా పరుగులు చేసే యువ క్రికెటర్లను ఎంపిక చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు.
Details
వన్డే ఫార్మాట్‌కు గుడ్‌బై?
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20 ఫార్మాట్ నుంచి వైదొలగగా, ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం వన్డే ఫార్మాట్‌కు కూడా వీడ్కోలు చెప్పొచ్చని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
భారత జట్టు భవిష్యత్తు కోసం యువ ఆటగాళ్లను తీర్చిదిద్దే బాధ్యత గంభీర్‌పై ఉందని కుంబ్లే వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.