LOADING...
Shubman Gill: వన్డే, టెస్టుల్లో రికార్డులు సృష్టించిన గిల్‌.. మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా మారే అవకాశం!
వన్డే, టెస్టుల్లో రికార్డులు సృష్టించిన గిల్‌.. మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా మారే అవకాశం!

Shubman Gill: వన్డే, టెస్టుల్లో రికార్డులు సృష్టించిన గిల్‌.. మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా మారే అవకాశం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 08, 2025
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఎనిమిదేళ్లలోనే జాతీయ జట్టు సారథ్యం చేపట్టడం ఎంత కష్టం అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సాధన చేసిన యువ క్రికెటర్‌ శుభ్‌మన్ గిల్. ఇవాళ ఆయన పుట్టినరోజు. ఇప్పటికే టెస్టు కెప్టెన్సీ తన సొంతం చేసుకున్న గిల్‌ను భవిష్యత్తులో మూడు ఫార్మాట్లకీ ఏకైక సారథిగా చూస్తారనడంలో సందేహమే లేదు.

Details

క్రికెట్ ప్రయాణం ప్రారంభం

2017లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అడుగు పెట్టిన గిల్, తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా, రెండో మ్యాచ్‌లోనే సెంచరీ బాదాడు. ఆ ప్రతిభే అండర్-19 జట్టులో చోటు సంపాదించేలా చేసింది. 2018 వరల్డ్‌కప్‌లో వైస్‌ కెప్టెన్‌గా ఎంపికై, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గౌరవం పొందాడు. పాక్‌పై సూపర్ సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. నెట్ ప్రాక్టీస్‌లోనే మాజీ కోచ్ రవిశాస్త్రిని మెప్పించిన గిల్, త్వరలోనే టీమ్ ఇండియాలోకి ప్రవేశించాడు. 2019లో వన్డేల్లో అరంగేట్రం చేసి, రోహిత్-విరాట్ ఉన్నా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. ఇప్పటివరకు 55 వన్డేల్లో 2,775 పరుగులు, 37 టెస్టుల్లో 2,674 పరుగులు, 21 టీ20ల్లో 578 పరుగులు సాధించాడు.

Details

సీనియర్లను దాటుకుని కెప్టెన్సీ

విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్‌గా కొనసాగాడు. కానీ వీరిద్దరూ టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలకడంతో కొత్త సారథ్యం ప్రశ్నగా మారింది. సూర్యకుమార్ యాదవ్ పొట్టి ఫార్మాట్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. హార్దిక్ పాండ్య పరిమిత ఓవర్లకే పరిమితం అయ్యాడు. టెస్టు పగ్గాల కోసం బుమ్రా, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ పేర్లు వినిపించాయి. చివరికి శుభ్‌మన్ గిల్‌కి ఆ అవకాశం దక్కింది. వన్డే, టీ20ల్లో ఇప్పటికే డిప్యూటీగా ఉన్న గిల్, వచ్చే పుట్టినరోజుకల్లా అన్ని ఫార్మాట్లకీ కెప్టెన్‌గా అవతరించొచ్చనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి.

Details

 వ్యక్తిగత జీవితం

వ్యక్తిగత విషయాలను బయట ఎక్కువగా చెప్పని గిల్, ఇప్పటికీ తాను సింగిల్‌నేనని చెబుతుంటాడు. సచిన్ కుమార్తె సారా తెండూల్కర్‌తో సంబంధం ఉందని వచ్చిన రూమర్స్‌ను కొట్టిపారేస్తూ, తన షెడ్యూల్ బిజీగా ఉండటం వల్ల రిలేషన్‌షిప్‌లకు టైమ్ కేటాయించలేనని స్పష్టం చేశాడు. క్రికెట్‌పైనే దృష్టి పెట్టిన గిల్, చిన్ననాటి స్నేహితుడు అభిషేక్ శర్మతో టైమ్ గడపడం, కుటుంబంతో ట్రావెల్స్ చేయడం ఇష్టపడతాడు. మొత్తానికి, తన ప్రతిభతో, క్రమశిక్షణతో, పట్టుదలతో శుభ్‌మన్ గిల్ భారత క్రికెట్ భవిష్యత్తు కెప్టెన్‌గా అవతరించడం ఖాయమనే నమ్మకం అభిమానుల్లో ఉంది.