ఫ్యాషన్ షోకి వెళ్లితే స్లిమ్‌గా ఉన్నవారు దొరుకుతారు, సెలెక్టర్లపై సన్నీ ఆగ్రహం
సెలెక్టర్లు క్రికెటర్ల ఆకారాన్ని బట్టి కాకుండా వారి టాలెంట్‌ను చూసి ఎంపిక చేయాలని సెలక్టర్లకు టీమిండియా మాజీ ప్లేయర్ గవస్కర్ సూచించారు. సన్నగా ఉన్నవారిని మాత్రమే కావాలనుకుంటే సెలెక్టర్లు ఫ్యాషన్ షోకి వెళ్లి కొంతమంది మోడల్స్‌ని ఎంచుకొని వారికి బ్యాట్, బాల్ ఇచ్చి జట్టులోకి చేర్చుకోవాలని ఆయన హితువు పలికారు. రంజీ ట్రోఫీలో ముంబై తరఫున సర్ఫరాజ్ ఖాన్ సెంచరీల మోత మోగిస్తున్నాడు. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టుల కోసం చేతన్ శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో సర్ఫరాజ్ ఖాన్‌కు స్థానం కల్పించకపోవడంతో గావస్కర్ సెలెక్టర్ల తీరుపై విరుచుకపడ్డారు.
చాలా నిరాశకు గురయ్యాను : సర్ఫరాజ్ ఖాన్
జట్టు ప్రకటించినప్పుడు అందులో తన పేరు లేకపోవడంతో చాలా నిరాశకు గురయ్యానని, ఆ రోజంతా భాదపడ్డానని, సర్ఫరాజ్ ఖాన్ తెలిపారు. తన తండ్రి ఢిల్లీ వచ్చినప్పుడు ధైర్యం చెప్పారని, మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టడంతో మంచి అనుభూతి కలిగిందని సర్ఫరాజ్ చెప్పాడు. ఒకానొక సందర్భంలో సర్ఫరాజ్ ఖాన్ ఏడ్చినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఆస్ట్రేలియాతో త్వరలో భారత్ నాలుగు టెస్టు మ్యాచ్‌లను ఆడనుంది. ఇప్పటికే రెండు టెస్టుల కోసం టీమిండియా జట్టును ప్రకటించగా.. మరో టెస్టుల కోసం ఇంకా జట్టును ప్రకటించలేదు.