NZ Vs UAE: 5 వికెట్లతో విజృంభించిన టీమ్ సౌథీ.. యూఏఈపై న్యూజిలాండ్ ఘన విజయం
యూఏఈతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్ శుభారంభం చేసింది. దుబాయ్ వేదికగా జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్ 19 పరుగుల తేడాతో గెలుపొందింది. న్యూజిలాండ్ కెప్టెన్ టీమ్ సౌథీ 5 వికెట్లతో విజృంభించి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో సీఫెర్ట్ 34 బంతుల్లో ( 3 సిక్సర్లు, రెండు ఫోర్లు) 55 పరుగులతో చెలరేగాడు. మెక్కన్చీ (31), నీసమ్ 25 పరుగులతో ఫర్వాలేదనిపించారు. యూఏఈ బౌలర్లలో సిద్ధుఖీ, హమీద్ తలా రెండు వికెట్లు తీయగా, జహుర్ ఖాన్, ఫరాజుద్దీన్ చెరో వికెట్ పడగొట్టారు.
ఆర్యాన్ష్ శర్మ హాఫ్ సెంచరీ వృథా
156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ జట్టుకు ఆరంభంలోని టిమ్ సౌథీ దెబ్బతీశాడు. కెప్టెన్ మహ్మద్ వసీంను తొలి బంతికే ఔట్ చేసి కష్టాల్లోకి నెట్టాడు. న్యూజిలాండ్ బౌలర్ టీమ్ సౌథీ బౌలింగ్ ధాటికి యూఏఈ 136 పరుగులకే ఆలౌటైంది. యూఏఈ బ్యాటర్లలో ఓపెనర్ ఆర్యాన్ష్ శర్మ 60 పరుగులతో రాణించనప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలం కావడంతో యూఏఈ జట్టుకు పరాభావం తప్పలేదు. టీ20 క్రికెట్‌లో సౌథీ ఐదు వికెట్లు తీయడం ఇది రెండోసారి. 2010లో ఆక్లాండ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 5/18 రాణించాడు.