Shikhar Dhawan: భార్య నుంచి వేధింపులు వాస్తవమే.. శిఖర్ ధావన్‌కు విడాకులు మంజూరు చేసిన కోర్టు
టీమిండియా వెటరన్ క్రికెటర్ శిఖర్ ధావన్, ఆయేషా ముఖర్జీ దంపతులుకు దిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో వారి 11 ఏళ్ల వివాహం బంధం రద్దైంది. పరస్పర అంగీకారంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారని కోర్టు స్పష్టం చేసింది. అయితే విచారణ సమయంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. శిఖర్ ధావన్‌ను తన భార్య ఆయేషా ముఖర్జీ తీవ్ర మానసిక వేదనకు గురి చేసినట్లు కోర్టు తేల్చింది. ఈ కేసులో ప్రాథమికంగా భార్య క్రూర ప్రవర్తన కారణంగానే వారికి విడాకులు మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. ఆయేషా ముఖర్జీపై ధావన్ చేసిన ఆరోపణలను న్యాయస్థానం సమర్థించింది.
ధావన్ పరువుకు నష్టం వాటిల్లేలా ఐపీఎల్ ఫ్రాంచేజీలకు సందేశాలు పంపిన ఆయేషా
తన కుమారుడికి దూరంగా ఉండాలని ధావన్‌ను అతడి భార్య మానసికంగా వేధించినట్లు కోర్టు గుర్తించింది. తన కుమారుడి శాశ్వత కస్టడీ కోసం ధావన్ చేసిన అభ్యర్థనపై తీర్పు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. కానీ, ధావన్ తన కుమారుడితో వీడియో కాల్ ద్వారా టచ్‌లో ఉండేందుకు అనుమతించింది. ధావన్ కొనుగోలు చేసిన మూడు ఆస్తులలో ఒకదానిని 90శాతం తన పేరిట రాయాలని ఆయేషా ఒత్తిడి తెచ్చింది. మిగిలిన రెండు ఆస్తులతో ఉమ్మడి యజమానిగా ఉంచాలని ధావన్‌ను వేధించింది. ధావన్ పరువుకు నష్టం వాటిల్లేలా తోటి క్రికెటర్లు, ఐపీఎల్ ప్రాంచేజీలకు ఆయేషా సందేశాలను పంపినట్లు కోర్టు తెలిపింది. ధావన్-ఆయేషాలకు 2012లో వివాహమైంది. ఆయేషాకు అప్పటికే వివాహం అయి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.