Hyderabad Women Cricketers: మహిళా క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్తించిన జట్టు ప్రధాన కోచ్ సస్పెండ్
మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మహిళా క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ విద్యుత్ జైసింహపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) శుక్రవారం సస్పెన్షన్ వేటు వేసింది. గత నెలలో బృందం బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు కోచ్ మద్యం సేవించి అసభ్యకరంగా మాట్లాడాడని మహిళలు హెచ్‌సీఏకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. జనవరి 12న జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. కోచ్‌ను సస్పెండ్ చేస్తూ హెచ్‌సిఎ లేఖ రాసింది.
వాట్సాప్ గ్రూపులలో షేర్ అయిన వీడియో
హైదరాబాద్ రాష్ట్ర జట్టుతో పర్యటనలో ఉన్నప్పుడు టీమ్ బస్సులో మహిళా క్రికెటర్ల ముందే జైసింహా మద్యం సేవించారని... మద్యం తీసుకెళ్తున్న వీడియోలతో హెచ్‌సిఎకి ఫిబ్రవరి 15న ఓ అనామక ఇమెయిల్ వచ్చింది. ఇంకా,ఈ వీడియోలు వివిధ వాట్సాప్ గ్రూపులలో కూడా షేర్ అవ్వడమే కాకుండా వివిధ టీవీ ఛానెల్‌లలో కూడా ప్రసారం అయ్యింది. ఈ విషయం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని, ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపించాలని HCAపేర్కొంది. సంస్థ తరపున ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఉండాలని కోచ్ జైసింహను HCA ఆదేశించింది .
బీసీసీఐకి,సుప్రీంకోర్టుప్రధాన న్యాయమూర్తికి జైసింహ ప్రవర్తనపై లేఖ
మరోవైపు, క్రికెటర్ల తల్లిదండ్రులు బీసీసీఐకి, సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తికి జైసింహ ప్రవర్తనపై ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. "మహిళల జట్టు ప్రధాన కోచ్ ఎప్పుడూ మద్యం తాగి అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఇది మా అమ్మాయిల భద్రతతో పాటు హెచ్‌సీఏ ప్రతిష్టను కూడా పణంగా పెడుతోంది'' అని లేఖలో పేర్కొన్నారు.