కోహ్లీ కెప్టెన్సీలో చాలా నేర్చుకున్నా : రోహిత్‌శర్మ
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఫలితంగా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ 120 పరుగుల చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయం అనంతరం తన కెప్టెన్సీ గురించి రోహిత్‌శర్మ మాట్లాడారు. కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు తాను ఆటగాడిగా ఉన్నానని, అప్పుడు కోహ్లీ నుంచి కొన్ని విషయాలను తెలుసుకున్నానని రోహిత్ శర్మ చెప్పారు.పిచ్ అనుకూలగా ఉన్న సరే కొన్నిసార్లు మనకు అనుకూలంగా ఫలితాలు రావన్నాడు. ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెంచి అది కొనసాగించుకుంటూ పోతేనే విజయాలు సొంతమవుతాయన్నాడు.
ప్రత్యర్థి తప్పు చేసేలా ఒత్తిడి పెంచాలి
వికెట్ పడకపోయినా ఫర్వాలేదని, కానీ ప్రత్యర్థి తప్పు చేసేలా ఒత్తిడి పెంచితేనే విజయం సాధ్యమవుతుందని రోహిత్ చెప్పారు. కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు అతను, బౌలర్లు అదే పని చేసేవాళ్లని రోహిత్ వివరించాడు. ఇప్పుడు తాను కూడా అదే పని చేయడానికి ప్రయత్నిస్తున్నానని వెల్లడించారు. పరిస్థితులు ఎప్పుడు రెండు జట్లకు ఒకేలా ఉన్నా, పిచ్ నుంచి అనుకూలమైన ఫలితాలు రాబట్టుకుంటేనే బౌలర్లు ప్రత్యేకంగా నిలుస్తారన్నారు. ఇలాంటి పిచ్‌లపై బంతులు ఎక్కడ విసిరాలో బౌలర్లకు బాగా తెలుసని రోహిత్ శర్మ పేర్కొన్నారు. ఈ నెల 17న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రెండో టెస్టు ప్రారంభంకానుంది.