Champions Trophy tour: పీఓకేలో ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ రద్దు.. కారణం ఏంటంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ (Champions Trophy tour) విషయంలో పాకిస్థాన్ అనైతిక యత్నాలకు ఐసీసీ (ICC) చెక్ పెట్టింది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్వహించాలనుకున్న ఛాంపియన్స్ ట్రోఫీ టూర్‌ను ఐసీసీ రద్దు చేసింది. ఈ విషయంలో బీసీసీఐ (BCCI) ఐసీసీని సంప్రదించగా వెంటనే ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి అధికారిక షెడ్యూల్ ను ఐసీసీ ఇంకా ప్రకటించలేదు. కానీ, ఛాంపియన్స్ ట్రోఫీ టూర్‌ను మాత్రం పాకిస్థాన్ ప్రారంభించింది. ఇందులో భాగంగా పాకిస్థాన్ కి మొదటగా ట్రోఫీని పంపింది. తద్వారా పాక్ క్రికెట్ బోర్డు టూర్ షెడ్యూల్‌ను తాజాగా ప్రకటించింది.
పాకిస్థాన్ కుటిల ప్రయత్నాలకు చెక్ పెట్టిన భారత్
నవంబరు 16న ఇస్లామాబాద్ నుంచి ఈ ట్రోఫీ టూర్ ప్రారంభం కానుంది. కానీ, ఈ షెడ్యూల్‌లో పాకిస్థాన్ ఆక్రమించిన పీవోకే ప్రాంతంలోని స్కర్దూ, హుంజా, ముజఫరాబాద్ ప్రాంతాలను కూడా చేర్చింది. ఇది భారత దేశాన్నిరెచ్చగొట్టడానికి మాత్రమే పాకిస్థాన్ తీసుకున్న చర్యగా భావిస్తున్నారు. అయితే, భారత జట్టు ఈ టూర్‌లో భాగంగా పాక్ పర్యటించదని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఈ నిర్ణయంతో పాక్ తన వక్ర బుద్ధిని మరోసారి కనబరచింది. పాకిస్థాన్ కుటిల ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకు భారత్ వెంటనే స్పందించింది. ఐసీసీ వద్ద తన అభ్యంతరాలను వెల్లడించింది.
హైబ్రిడ్ పద్ధతిలో ఈ టోర్నీని నిర్వహించాలని కోరిన భారత్
దీన్ని దృష్టిలో పెట్టుకుని ఐసీసీ పీవోకే టూర్‌ను రద్దు చేసింది. దీంతో పాకిస్థాన్ మరోసారి అంతర్జాతీయ వేదికలపై తన పరువు కోల్పోయింది. మరోవైపు, ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లను పాకిస్థాన్‌లోని లాహోర్, రావల్పిండి, కరాచీ వేదికలపై నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, భారత్ ఐసీసీకి ఈ టోర్నీ కోసం పాకిస్థాన్‌కు వెళ్లడానికి సిద్ధంగా లేదని స్పష్టం చేసింది. భారత్ హైబ్రిడ్ పద్ధతిలో ఈ టోర్నీని నిర్వహించాలని కోరింది. అయితే, పీసీబీ (PCB) దీనికి అంగీకరించకపోవడంతో షెడ్యూల్ ప్రకటన ఆలస్యమవుతోంది.