LOADING...
ICC: కెనడా క్రికెట్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. దర్యాప్తు ప్రారంభించిన ఐసీసీ
కెనడా క్రికెట్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. దర్యాప్తు ప్రారంభించిన ఐసీసీ

ICC: కెనడా క్రికెట్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. దర్యాప్తు ప్రారంభించిన ఐసీసీ

వ్రాసిన వారు Moogati Shabari
Apr 17, 2026
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కు చెందిన యాంటీ-కరప్షన్ యూనిట్ (ACU) ప్రస్తుతం క్రికెట్ కెనడాపై వచ్చిన అవినీతి ఆరోపణలను విచారిస్తోంది. ఈ దర్యాప్తు 2026 ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సమయంలో కెనడా జట్టు ఆడిన ఒక మ్యాచ్‌పై కేంద్రీకృతమైంది. భారత్, శ్రీలంకలో జరిగిన ఈ టోర్నీలో జరిగిన ఘటనలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. "కరప్షన్, క్రైమ్ అండ్ క్రికెట్ " పేరుతో కెనడాకు చెందిన ది ఫిఫ్త్ ఎస్టేట్ రూపొందించిన డాక్యుమెంటరీలో ఈ ఆరోపణలు బయటకు వచ్చాయి.

వివరాలు

ఆ ఓవర్లో 15 పరుగులు ఇవ్వడంతో అనుమానం..

చెన్నైలో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై కెనడా ఆడిన ఆట ఇప్పుడు అనుమానాలకు దారితీసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఐదో ఓవర్‌పై డాక్యుమెంటరీ దృష్టి సారించింది. ఆ ఓవర్‌ను కెనడా కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా వేసాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌ అయిన బజ్వా ఆ ఓవర్‌లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేదు. మొదట నో-బాల్ వేయడం, తర్వాత లెగ్ సైడ్ వైడ్ వేయడంతో పాటు మొత్తం 15 పరుగులు ఇవ్వడం అనుమానాలకు తావిచ్చింది. ఇక మరో అంశంగా మాజీ కోచ్ ఖుర్రం చోహన్‌కు సంబంధించిన లీక్ అయిన ఫోన్ కాల్ వెలుగులోకి వచ్చింది. ఆ కాల్‌లో జాతీయ జట్టుకు కొంతమంది ఆటగాళ్లను తప్పనిసరిగా ఎంపిక చేయాలని తనపై ఒత్తిడి తెచ్చారని ఆయన ఆరోపించారు.

వివరాలు

ఆ ఆరోపణలపై విచారణ ప్రారంభం..

అలాగే మ్యాచ్ ఫిక్సింగ్ ప్రయత్నాలు జరిగినట్లుగా కూడా ఆ ఆడియోలో సంకేతాలు ఉన్నాయని డాక్యుమెంటరీ పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను స్పష్టమైన ఆధారాలతో నిరూపించడం కష్టమని తెలుస్తోంది. ఈ ఆరోపణలపై స్పందించిన ఐసీసీ ఇంటిగ్రిటీ యూనిట్ తాత్కాలిక జనరల్ మేనేజర్ ఆండ్రూ ఎఫ్గ్రేవ్ మాట్లాడుతూ, డాక్యుమెంటరీ ప్రసారం విషయం తమకు తెలిసినదేనని తెలిపారు. అయితే తమ నిబంధనల ప్రకారం అందులో ఉన్న ప్రత్యేక ఆరోపణలపై కామెంట్ చేయలేమన్నారు. సభ్య దేశాలపై గవర్నెన్స్‌కు సంబంధించిన విషయాలను ఐసీసీ రాజ్యాంగ ప్రక్రియల ప్రకారం నిర్వహిస్తామని కూడా స్పష్టం చేశారు.

Advertisement

వివరాలు

కోర్టులో కేసు వేసిన ఆ ప్లేయర్..

ఇదిలా ఉంటే, మరో మాజీ కోచ్ పుబుడు దస్సనాయకే కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు. 2024 టీ20 వరల్డ్ కప్ కోసం జట్టు ఎంపిక సమయంలో తనపై ఒత్తిడి తెచ్చారని ఆయన పేర్కొన్నారు. కొన్ని ఆటగాళ్లను బలవంతంగా ఎంపిక చేయాలని బోర్డు ప్రయత్నించిందని, నిరాకరించడంతో తన కాంట్రాక్ట్ రద్దు చేస్తామని బెదిరించినట్లు ఆరోపించారు. ఈ ఘటనపై ప్రస్తుతం దస్సనాయకే క్రికెట్ కెనడాపై.. తప్పుడు విధంగా ఉద్యోగం నుంచి తొలగించారని కోర్టులో కేసు వేశారు.

Advertisement

వివరాలు

నిజాలు బయటపెట్టిన డాక్యుమెంటరీ..

ఇక క్రికెట్ కెనడాలో మరికొన్ని సమస్యలు కూడా ఉన్నట్లు డాక్యుమెంటరీ పేర్కొంది. 2024 టీ20 వరల్డ్ కప్‌లో ఆటగాళ్లకు రావాల్సిన ప్రైజ్ మనీ చెల్లింపులు ఆలస్యమయ్యాయని తెలిపింది. అంతేకాకుండా, 2025 జూలై నుంచి ఆటగాళ్లతో కాంట్రాక్టులు నిలిపివేసి, 2026 టోర్నీకి ముందు వరకు చిన్న మొత్తంలో మాత్రమే రిటైనర్ ఇవ్వడం కూడా వివాదానికి దారి తీసినట్లు సమాచారం.

Advertisement