Virat Kohli : ఆర్సీబీకి కెప్టెన్‌గా కోహ్లీ వస్తే.. జట్టులో కీలక మార్పులు: మంజ్రేకర్
ఐపీఎల్ మెగా వేలం సౌదీ అరేబియాలో నవంబర్ 24, 25 తేదీల్లో జరగనుంది. ప్రస్తుతానికి అన్ని ఫ్రాంచైజీలు కనిష్ఠంగా ఇద్దరు నుంచి గరిష్ఠంగా ఆరుగురు క్రికెటర్లను రిటైన్ చేసుకున్నాయి. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వంటి కొన్ని జట్లకు కొత్త సారథిని నియమించాల్సి ఉంది. అయితే ఆర్సీబీ గత సీజన్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ను రిటైన్ చేయలేదు. దీంతో, సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి మరోసారి కెప్టెన్సీ అప్పగించే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వస్తే, జట్టులో పాత సహచరుడు యుజ్వేంద్ర చాహల్ తీసుకోవచ్చని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. అయితే చాహల్‌ను పొందడంలో రాజస్థాన్ రాయల్స్ నుంచి గట్టి పోటీ ఎదురుకావచ్చు.
చాహల్ ను తీసుకొనే అవకాశం
విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వస్తే, జట్టులో చాలా మార్పులు జరుగుతాయని, చాహల్‌ను వేలంలో తీసుకునే అంశంలో ఆసక్తి చూపుతారని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నారు. రాజస్థాన్ రాయల్స్ అశ్విన్ కాంబినేషన్ కోసం చాహల్‌ను విడిచిపెట్టదని చెప్పారు. గత సీజన్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ రాణించకపోయినా, ఆర్సీబీ అతడిని వేలంలో తిరిగి దక్కించుకునే ప్రయత్నం చేయవచ్చు. మ్యాక్సీ ఫామ్‌లో ఉంటే, అతడిని ఆపడం చాలా కష్టమన్నారు. ఈసారి ఐపీఎల్ మెగా వేలం కోసం షార్ట్‌లిస్ట్ జాబితాను ఐపీఎల్ కమిటీ ఇప్పటికే విడుదల చేసింది. ఇందులో రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి ప్రముఖ భారత ఆటగాళ్లు ఉన్నారు.
ఆర్సీబీ ఖాతాలో రూ.41 కోట్లు
ఆర్సీబీ ఖాతాలో ఇంకా రూ. 41 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేయడం కష్టంగా మారొచ్చు. ఇలాంటి తరుణంలో ఆర్సీబీ వ్యూహాత్మకంగా ఎంపికలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే కొన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను రిటైన్ చేసుకుని, వేలం కోసం పక్కాగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. సౌదీ అరేబియాలో జరిగే ఈ మెగా వేలం కోసం భారత క్రికెట్ అభిమానులకు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.