Rohit Sharma: ధోని మాదిరిగానే రోహిత్ శర్మ కూడా అత్యుత్తమ కెప్టెన్ : శ్రీశాంత్
టీమిండియా(Team India) మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని(MS Dhoni) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీమిండియా టీ20 వరల్డ్ కప్ తో పాటు, వన్డే ప్రపంచ కప్ ను అందించిన ఘనత ధోనికే దక్కుతుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా భారత్ ధోనీ సారథ్యంలోనే గెలిచింది. అయితే ట్రోఫీలు గెలవకపోయినా ప్రస్తుతం భారత జట్టును రోహిత్‌శర్మ(Rohit Sharma), ధోని బాటలోనే నడిపిస్తున్నాడు. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ నాయకత్వంలోని భారత్ ఫైనల్‌కు చేరింది. ఇక వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్‌లోనూ రోహిత్ శర్మనే కెప్టెన్‌గా ఉంటాడనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆటగాడు శ్రీశాంత్(Sreesanth), రోహిత్ శర్మను ధోనితో పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రోహిత్ శర్మపై శ్రీశాంత్ ప్రశంసలు
ఆట పట్ల పూర్తిస్థాయి అవగాహన, నైపుణ్యం కలిగిన ఆటగాడు రోహిత్ శర్మ అని, అచ్చం ధోనిలాగే జట్టును నడిపించే నాయకుడు రోహిత్ అని శ్రీశాంత్ కొనియాడారు. బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఒక్కోసారి మెరుగైన ప్రదర్శన చేయకపోయినా ఆటగాళ్లకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తాడని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్ అయినా జట్టులోని సహచరులకు స్నేహితుడిగా, సోదరుడిగా ఉంటాడని, ఆటగాళ్లందరినీ సరైన మార్గంలో నడిపిస్తాడని చెప్పాడు. ఆటగాళ్లలో నైపుణ్యం వెలికితీయడంలో రోహిత్, ధోని ఒకేలా ఆలోచిస్తారని శ్రీశాంత్ వివరించాడు.