IND Vs AUS: ఫుల్ ఫిట్‌నెస్‌తో బుమ్రా.. బౌలింగ్ వీడియో వైరల్
అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్ తర్వాత టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్‌పై కొంత ఆందోళన నెలకొంది. రెండో రోజు ఆట సమయంలో బుమ్రా తొడ కండరాలు పట్టేయడంతో ఫిజియో వచ్చి చికిత్స అందించారు. ఆ తర్వాత ఆయన తన బౌలింగ్‌ను కొనసాగించినప్పటికీ, పూర్తి ఫిట్‌గా లేనందున బ్రిస్బేన్ వేదికగా జరగబోయే మూడో టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే ఇవి వట్టి పుకార్లేనని చెప్పాలి, ఎందుకంటే బుమ్రా ప్రస్తుతం ఫుల్ ఫిట్‌నెస్‌తో నెట్స్‌లో శ్రమిస్తున్నాడు. నెట్స్‌లో కేఎల్ రాహుల్, యశస్వీ జైశ్వాల్‌లకు బుమ్రా సుదీర్ఘకాలం బౌలింగ్ చేసిన వీడియోను భరత్ సుందరేశన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
బ్రిస్బేన్ టెస్ట్‌లో భారత జట్టు కొన్ని మార్పులతో బరిలోకి దిగే అవకాశం
ఆ వీడియోలో బుమ్రా పూర్తిగా ఫిట్‌గా ఉన్నట్లు స్పష్టమైంది. ఈ సిరీస్‌లో బుమ్రా అద్భుత ప్రదర్శన చూపిస్తూ, తొలి రెండు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు సాధించాడు. మరోవైపు, డిసెంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే బ్రిస్బేన్ టెస్ట్‌లో భారత జట్టు కొన్ని మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. రెండో టెస్ట్‌లో విఫలమైన పేసర్ హర్షిత్ రాణాపై జట్టు మేనేజ్‌మెంట్ వేటు వేసి, ఆయన స్థానంలో ప్రసిద్ద్ కృష్ణను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అలాగే అశ్విన్ స్థానంలో జడేజాను ఆడించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, గబ్బా టెస్ట్‌కు వర్షం ముప్పు ఉండవచ్చని కూడా అంచనా వేస్తున్నారు.
భారత తుది జట్టు(అంచనా):
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ప్రసిద్ద్ కృష్ణ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్