IND vs AUS:నాలుగో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్.. బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు ట్రావిస్ హెడ్ కి గాయం
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ గురువారం నుంచి మెల్‌బోర్న్‌లో ప్రారంభం కానుంది. ఈ బాక్సింగ్ డే టెస్టులో విజయం సాధించాలనే ఉత్సాహంతో రెండు జట్లు పోటీ పడనున్నాయి. ప్రస్తుతం ఇరు జట్లు సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచాయి.అయితే,నాలుగో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలే అవకాశముంది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ గాయంతో బాధపడుతున్నాడు.అతను పూర్తిగా కోలుకోలేదని, దీంతో నాలుగో టెస్టుకు దూరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బ్రిస్బేన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో హెడ్ కుంటుంటూ కనిపించాడు. టీమిండియా రెండో ఇన్నింగ్స్ సమయంలో అతడు ఫీల్డింగ్‌కు రాలేదు.అతడు తొడ కండరాల గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం.
ఫిట్‌నెస్ ఆందోళనను తోసిపుచ్చిన ఆండ్రూ మెక్‌డొనాల్డ్
సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ నివేదిక ప్రకారం,అతడు నాలుగో టెస్టు కోసం ఆసీస్ జట్టు ప్రాక్టీస్ సెషన్లలో కనిపించలేదని తెలిపింది. మ్యాచ్‌కు ముందు అతనికి ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహిస్తారనీ, అందులో ఉత్తీర్ణుడైతే అతను ఆడతాడని కథనం పేర్కొంది. హెడ్ గాయం పై ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ స్పందించాడు.ఫిట్‌నెస్ ఆందోళనను తోసిపుచ్చారు. అయితే, అతను నాలుగో టెస్టులో ఆడతాడో లేదో అన్న విషయాన్ని 100 శాతం ధ్రువీకరించలేదని చెప్పారు.
టీమిండియా విజయం సాధించే అవకాశాలు మరింత మెరుగు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో హెడ్ ఫామ్‌లో ఉన్నాడు. మూడు టెస్టుల్లో 409 పరుగులు సాధించాడు.ఇందులో రెండు శతకాలు ఉన్నాయి. కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న హెడ్ నాలుగో టెస్టుకు దూరం అయితే ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ అవుతుంది. ఈ సిరీస్‌లో భారత్‌కు కొరకరాని కొయ్యగా మారిన హెడ్, నాలుగో టెస్టుకు దూరం అయితే టీమిండియా విజయం సాధించే అవకాశాలు మరింత పెరిగుతాయి.