Ind Vs Ban: బంగ్లాదేశ్ కోసం ప్రత్యేక ప్రణాళికలు లేవు : రోహిత్ శర్మ
భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన ప్రత్యర్థుల గురించి ఎక్కువగా ఆలోచించబోమని పేర్కొన్నాడు. బంగ్లాదేశ్ కోసం ప్రత్యేక ప్రణాళికలు చేయలేదని, మిగతా జట్లను ఎలా ఎదుర్కొంటామో అదే విధంగా బంగ్లాదేశ్‌ను కూడా చూస్తామని వివరించాడు. జట్టులోని అత్యుత్తమ ఆటగాళ్లందరూ ప్రతి మ్యాచ్‌లో ఆడేలా చూసే లక్ష్యముందని, కొన్ని సందర్భాల్లో అది సాధ్యంకాదని స్పష్టం చేశాడు. దేశవాళీ క్రికెట్ నుంచి ఎంతో మంది యువ బౌలర్లు గుర్తింపు పొందుతుండడం క్రికెట్ కోసం శుభపరిణామమని రోహిత్ అభిప్రాయపడ్డాడు. సెప్టెంబర్ 19న బంగ్లాదేశ్‌తో మొదటి టెస్టు ప్రారంభం కానుండగా, రోహిత్ మంగళవారం విలేకరులతో మాట్లాడాడు.
బంగ్లాదేశ్ కోసం ప్రత్యేక ప్రణాళికలు అవసరం లేదు
"ప్రతి జట్టు భారత్‌ను ఓడించాలని అనుకుంటుంది. అది వారు గర్వకారణంగా భావిస్తారు. అది వారి ప్రయత్నం. కానీ, మేము గెలవడంపైనే దృష్టి పెడతాం. టీమిండియాపై ప్రత్యర్థులు ఎలా ఆలోచిస్తున్నారో మేము పట్టించుకోం. మేము అన్ని అగ్రశ్రేణి జట్లతో ఆడుతూ ఉంటాం, కాబట్టి బంగ్లాదేశ్ కోసం ప్రత్యేక ప్రణాళికలు చేయాల్సిన అవసరం లేదు. బంగ్లా జట్టులో ఇద్దరు కొత్త ఆటగాళ్లు ఉన్నారు. కాస్తా వారి పై దృష్టి పెడతాం. మేము సాధారణంగా అనుసరించే ప్రణాళికలనే ఈ సిరీస్‌లో కొనసాగిస్తాం," అని రోహిత్ వివరించాడు.
రొటేషన్ విధానంలో బౌలర్లకు విరామం
అతను ఆటగాళ్ల గురించి మాట్లాడుతూ, "మేము ప్రతి మ్యాచ్‌లోనూ అత్యుత్తమ ఆటగాళ్లందరినీ ఆడించాలనుకుంటాం, కానీ కొన్నిసార్లు అది సాధ్యం కాదు. పని భారాన్ని దృష్టిలో ఉంచుకుని, టెస్టు క్రికెట్ మధ్యలో టీ20లు కూడా ఆడుతున్నాము, కాబట్టి బౌలర్లను జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. రొటేషన్ విధానంలో మేము బౌలర్లకు విరామం ఇస్తున్నాం. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో కూడా జస్ప్రీత్ బుమ్రాకు ఒక మ్యాచ్ విరామం ఇచ్చాం. దేశవాళీ స్థాయిలో యువ బౌలర్లు రావడం మంచి పరిణామం," అని రోహిత్ వివరించాడు.