Page Loader
India vs New Zealand: వర్షం టీమిండియాని కాపాడుతుందా.. 36 ఏళ్ల చ‌రిత్ర‌కు బ్రేక్ ప‌డుతుందా?
వర్షం టీమిండియాని కాపాడుతుందా.. 36 ఏళ్ల చ‌రిత్ర‌కు బ్రేక్ ప‌డుతుందా?

India vs New Zealand: వర్షం టీమిండియాని కాపాడుతుందా.. 36 ఏళ్ల చ‌రిత్ర‌కు బ్రేక్ ప‌డుతుందా?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 20, 2024
08:48 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రత్యర్థి న్యూజిలాండ్ ముందు కేవలం 107పరుగుల లక్ష్యం.ఇప్పుడు కేవలం ఒక్క రోజే మిగిలి ఉంది. సాధారణ పరిస్థితుల్లో, ఇలాంటి పరిమిత లక్ష్యం బ్యాటింగ్ జట్టుకు పెద్ద సవాలు కాకపోవచ్చు.అయితే, బెంగళూరు పిచ్‌ నాలుగో ఇన్నింగ్స్‌ లో స్పిన్నర్లకు పూర్తిగా సహకారం అందిస్తుంది. కాబట్టి,ఈ చిన్నలక్ష్యాన్ని భారత జట్టు కాపాడే అవకాశాలను పూర్తిగా విస్మరించలేం. గతంలో ఇలాంటి సందర్భాలలో టీమిండియా విజయం సాధించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి, అందరి దృష్టి ఒకటే ప్రశ్న మీద నిలిచింది - ఈ మ్యాచ్‌ కొనసాగుతుందా లేదా? శనివారం నాటి నాలుగో రోజు చివరిలో వెలుతురు లేకపోవడంతో ఆట నిలిపివేయబడింది.అప్పుడు భారీ వర్షం కూడా కురిసింది. ఈ నేపథ్యంలో,ఇప్పుడు బెంగళూరులో వాతావరణం ఎలా ఉంటుందనేది అందరి ఆసక్తి.

వివరాలు 

ఆట షెడ్యూల్‌,వాతావరణ అంచనా 

షెడ్యూల్‌ ప్రకారం, ఐదో రోజు ఆట ఉదయం 9:15 గంటలకు ప్రారంభం కావాలి. కానీ, వాతావరణ అంచనా ప్రకారం, ఆ సమయంలో వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శనివారం రాత్రి మొదలైన వర్షం మధ్యలో ఆగినా, ఆదివారం సాయంత్రం వరకు అడపాదడపా వర్షం పడుతూనే ఉంటుందని సమాచారం. ఈ పరిస్థితి కొనసాగితే,మ్యాచ్‌ నిర్వహణ కష్టతరంగా మారుతుంది.ఇప్పటి పరిస్థితి చూస్తే,ఆకాశం మేఘావృతమై ఉంది. ఉదయం 11 గంటల వరకు వర్షం ఆగినా,మైదానాన్ని సిద్ధం చేయడానికి కనీసం గంట సమయం పడుతుంది. మొదటి సెషన్‌ ఆట కోల్పోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి.మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు కూడా వర్షం పడుతుందని అంచనా.

వివరాలు 

భారత్ విజయావకాశాలపై అజయ్‌ జడేజా 

సాయంత్రం 4గంటల నుంచి వర్షం తగ్గుతుందని పేర్కొన్నప్పటికీ,అప్పటికే మైదానం నానిపోయే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మ్యాచ్‌ పూర్తిగారద్దు అవుతుందా లేదా అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ప్రత్యర్థి ఎదుట కేవలం 107పరుగుల టార్గెట్‌ను ఉంచిన టీమిండియా విజయావకాశాలపై మాజీ క్రికెటర్‌ అజయ్‌ జడేజా స్పందించాడు. ''ఈ లక్ష్యాన్ని కాపాడుకుంటే అది అద్భుతమైన విజయం అవుతుంది.అయితే,సాధారణంగా ఆ లక్ష్యం కాపాడటం అంత సులభం కాదు.ఐదోరోజు ఆట మొదలైనప్పుడు మొదటి సెషన్‌ సీమ్‌ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది.కానీ భారత్‌ వద్ద కేవలం ఇద్దరు ఫాస్ట్‌ బౌలర్లు ఉన్నారు.మూడో బౌలర్‌ లేకపోవడం ఓ లోటుగా కనిపిస్తుంది.ఒకటి రెండు వికెట్లు తీయగలిగినా సరిపోదు.స్పిన్నర్లు వచ్చే లోపు పేసర్లు ఎక్కువ పరుగులు ఇవ్వకుండా ఉండాలి''అని జడేజా అభిప్రాయపడ్డాడు.