IND VS WI: భారత స్పిన్ దెబ్బకు విండీస్ విలవిల.. ఐదు వికెట్లతో చెలరేగిన అశ్విన్
డొమినికాలోని విండర్స్ పార్క్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా స్పిన్ దెబ్బకు విండీస్ బ్యాటర్లు విలవిలలాడారు. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 64.3 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది. మొదటి 12 ఓవర్ల పాటు ఓపెనర్లు క్రెయిగ్ బ్రాత్‌వైట్ (20: 46 బంతుల్లో, మూడు ఫోర్లు), తేజ్‌నారాయణ్ చందర్‌పాల్(12) వికెట్ ఇవ్వకుండా ఆపారు. మొదటి వికెట్ కు వీరిద్దరూ 31 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో తేజ్ నారాయణ్ చందర్ పాల్‌ను రవిచంద్రన్ అశ్విన్ ఔట్ చేసి భారత్ కు మొదటి వికెట్ అందించారు. విండీస్ బ్యాటర్లలో అలిక్ అథానాజ్ 47 మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. అశ్విన్ 5 వికెట్లతో చెలరేగగా, జడేజా మూడు వికెట్లతో రాణించాడు.
700 వికెట్ల క్లబ్ లో చేరిన అశ్విన్
టెస్టు క్రికెట్లో 33 సార్లు ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ రికార్డుకెక్కాడు. విండీస్ మ్యాచులో ఐదు వికెట్లు తీయడంతో అశ్విన్ 700 వికెట్ల క్లబ్ లో చేరాడు. జోసెఫ్ ను ఔట్ చేయడంతో అన్ని ఫార్మాట్లలో కలిపి ఈ ఘనత సాధించిన మూడో ఇండియన్ బౌలర్‌గా, ఓవరాల్‌గా 16వ బౌలర్ గా నిలిచాడు. ఇక టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. భారత్ ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ 40, రోహిత్ శర్మ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక ఇలానే టీమిండియా ఆడితే భారీ స్కోరును చేయడం ఖాయంగా కనిపిస్తోంది.