IND Vs WI : నిలవాలంటే.. కచ్చితంగా గెలవాల్సిందే!
టీమిండియా, వెస్టిండీస్ మధ్య నేడు కీలక పోరు జరగనుంది. మంగళవారం గయానా వేదికగా విండీస్‌తో జరగనున్న మూడో టీ20లో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఐదు టీ20ల సిరీస్‌లో ఇప్పటికే రెండు ఓడిన భారత్ నేటి మ్యాచులో గెలిస్తేనే సిరీస్‌లో నిలవనుంది. మరోవైపు బలమైన టీమిండియాపై వరుసగా రెండు టీ20ల్లో గెలిచిన విండీస్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఈ జోరుతో మూడో టీ20లోనూ నెగ్గి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. టీమిండియా కొన్ని మార్పులతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్ స్థానంలో యశస్వీ జైస్వాల్‌కు అవకాశం ఇవ్వాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
సంజుశాంసన్ కు మరో అవకాశం!
వరుసగా రెండో టీ20ల్లో విఫలమైన సంజూ శాంసన్‌కు మరో అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. బౌలింగ్ విభాగంలో ముఖేష్ కుమార్‌ను పక్కనపెట్టి అతడి స్థానంలో యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ను అవకాశం ఇవ్వాలని కోచ్ ద్రవిడ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు మ్యాచుల్లో గెలిచి ఉత్సాహంతో ఉన్న విండీస్, మూడో టీ20లో ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగనుంది. గయానా పిచ్ బౌలర్లకే ఎక్కువ సహకరించొచ్చు. చిన్న బౌండరీలు కావడంతో బ్యాటర్లు భారీ షాట్లు కొట్టడం సులభంగా ఉంటుంది. భారత జట్టు: యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్