Page Loader
IND vs PAK:నేడు భారత్, పాక్ హైవోల్టేజ్ మ్యాచ్.. ఎవరు పైచేయి సాధిస్తారో?
నేడు భారత్, పాక్ హైవోల్టేజ్ మ్యాచ్.. ఎవరు పైచేయి సాధిస్తారో?

IND vs PAK:నేడు భారత్, పాక్ హైవోల్టేజ్ మ్యాచ్.. ఎవరు పైచేయి సాధిస్తారో?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 23, 2025
10:08 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్లో టీమిండియా ఆధిపత్యం కొనసాగిస్తోంది. పాకిస్థాన్‌పై కొన్ని సంవత్సరాలుగా భారత్ విజయ పరంపర కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా భారత్‌తో మ్యాచ్ అంటే ఒత్తిడంతా పాక్ పైనే ఉంటుంది. ఇక ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ ఓడి, సంక్లిష్ట పరిస్థితిలో భారత్‌తో తలపడనుంది. మరోవైపు బంగ్లాదేశ్‌ను ఓడించి మంచి ఊపులో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. సెమీస్ బెర్తును ఖాయం చేసుకోవాలని భారత్ చూస్తుండగా, టోర్నీలో కొనసాగాలంటే పాకిస్థాన్ ఈ మ్యాచ్‌లో గెలవాల్సిన పరిస్థితి.

Details

అద్భుత ఫామ్ లో భారత జట్టు

గత మ్యాచ్‌లో భారత జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉండటంతో తుది జట్టులో మార్పులు చేసే అవకాశం తక్కువ. వరుసగా రెండు వన్డే సెంచరీలతో గిల్ మంచి ఫామ్‌లో ఉండగా, రోహిత్ శర్మ మెరుపు ఆరంభాలు అందిస్తూనే ఉన్నాడు. కోహ్లీ మాత్రం తన అసలైన ఆటతీరు చూపించలేకపోతున్నాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రాహుల్ ఆకట్టుకోగా, శ్రేయస్ అయ్యర్ రాణిస్తే టీమిండియా భారీ స్కోరు చేయడం ఖాయం. హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా బ్యాటింగ్ అవసరం లేకుండానే గత మ్యాచ్‌ను భారత్ ముగించగా, అక్షర్ పటేల్‌పై మరోసారి మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని చూపింది. బౌలింగ్‌లో మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శన చేయడంతో భారత బౌలింగ్ మరింత బలంగా మారింది.

Details

పాక్ జట్టు సంక్షోభంలో 

ఛాంపియన్స్ ట్రోఫీలో తమ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ భారీ ఓటమిని ఎదుర్కొంది. దాని ప్రభావంగా రన్‌రేట్‌ కూడా క్షీణించింది. ఇప్పుడు భారత్‌ను ఓడించగలిగితేనే టోర్నమెంట్‌లో కొనసాగుతుంది. లేనిచో సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో చివరి మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. పాక్ బ్యాటింగ్ లైన్-అప్ బలహీనంగా కనిపిస్తోంది. బాబర్ ఆజమ్‌పై ఆధారపడటం కొనసాగుతూనే ఉంది. అయితే గత మ్యాచ్‌లో అతను స్లో బ్యాటింగ్ చేయడం విమర్శలకు గురైంది. ఫఖర్ జమాన్ గాయంతో దూరంగా ఉండటంతో టీమ్‌లోకి వచ్చిన ఇమామ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. రిజ్వాన్, షకీల్ కూడా ఫెయిల్ అయ్యారు. పేసర్లైన షాహిన్ ఆఫ్రిది, హారిస్ రవూఫ్, నసీమ్‌లు భారీ పరుగులు సమర్పించుకుంటున్నారు. పైగా, తుది జట్టులో నాణ్యమైన స్పిన్నర్ కూడా లేకపోవడం మరో ప్రతికూలత.

Details

 పిచ్ పరిస్థితి, వాతావరణం 

గత మ్యాచ్ తరహాలోనే ఈ పిచ్ నెమ్మదిగా ఉండే అవకాశం ఉంది. బ్యాటర్లు పట్టుదలగా ఆడితే భారీ స్కోరు సాధించవచ్చు. వర్షం కురిసే అవకాశం లేకుండా ఉండటంతో, టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. అంచనా తుది జట్లు టీమిండియా రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, నితీష్ రాణా. పాకిస్థాన్ మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), ఇమామ్, షకీల్, బాబర్ ఆజమ్, సల్మాన్, తాహిర్, ఖుష్దిల్, అఫ్రిది, నసీమ్, హారిస్ రవూఫ్, అబ్రార్.