Page Loader
Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలకు రోహిత్ శర్మ పాకిస్థాన్‌ వెళ్తాడా? లేదా?
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలకు రోహిత్ శర్మ పాకిస్థాన్‌ వెళ్తాడా? లేదా?

Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలకు రోహిత్ శర్మ పాకిస్థాన్‌ వెళ్తాడా? లేదా?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 15, 2025
10:51 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫిబ్రవరి 19 నుండి 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమవుతుంది. ఈ ఐసీసీ టోర్నీకి పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే, భారత్ ఆడే అన్ని మ్యాచులు దుబాయ్‌ వేదికగా జరగనున్నాయి. పాకిస్థాన్‌ బోర్డు హైబ్రిడ్‌ మోడల్‌లో టోర్నీ నిర్వహించాలని అంగీకరించింది. భారత్ సెమీస్‌, ఫైనల్‌కు చేరుకున్నా అవన్నీ దుబాయ్‌లోనే జరుగుతాయి. 1996 తర్వాత పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇచ్చే తొలి ఐసీసీ టోర్నీ కావడంతో ప్రారంభ వేడుకలు అద్భుతంగా నిర్వహించాలనుకుంటోంది. ఫిబ్రవరి 16 లేదా 17న ఓపెనింగ్ సెర్మనీ జరుగవచ్చని అంచనా.వార్మప్ మ్యాచుల ప్రకారం తేదీలు మారవచ్చు.

వివరాలు 

భారత ప్రభుత్వాన్నిఅనుమతి కోరిన బీసీసీఐ 

ప్రతి జట్టు సారథి ప్రారంభోత్సవంలో పాల్గొనాలని పాకిస్థాన్‌ కోరుతుంది. కానీ, భారత కెప్టెన్ పాకిస్థాన్‌కు వెళ్ళేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుందా అన్నది ప్రశ్నగా నిలుస్తోంది. పాకిస్థాన్‌లో ఆడేందుకు భారత ప్రభుత్వాన్ని బీసీసీఐ ఇప్పటికే అనుమతిని కోరింది. ఇప్పుడు, కెప్టెన్ పాకిస్థాన్‌ చేరతాడా లేదా? అనే అంశం చర్చనీయాంశంగా మారింది.అయితే, బీసీసీఐ ప్రతినిధులు భారత కెప్టెన్ ఆ కార్యక్రమానికి వెళ్తాడని చెబుతున్నాయి. "భారత సారథి పాకిస్థాన్‌ వెళ్లి, పీసీబీ ఆతిథ్యంలో నిర్వహించబడే ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభోత్సవంలో పాల్గొంటాడు. 29 ఏళ్ల తరువాత పాకిస్థాన్‌లో ఐసీసీ టోర్నీ జరుగుతుంది"అని బీసీసీఐ ప్రతినిధులు వెల్లడించారు. కేంద్రం అనుమతి ఇస్తేనే,భారత కెప్టెన్ పాకిస్థాన్‌ చేరుకుంటాడు.లేదంటే,భారత కెప్టెన్‌ లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలు జరుగుతాయా? అనేది చూడాలి.

వివరాలు 

23 ఫిబ్రవరి పాకిస్థాన్‌తో దుబాయ్‌లో భారత్‌ మ్యాచ్ 

దుబాయ్‌లో నిర్వహించినా ఆశ్చర్యపోనక్కర్లేదని క్రికెట్ వర్గాల మాట. పాకిస్థాన్ మాత్రం తమ దేశంలోనే ఈ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పట్టుదలతో ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్థాన్‌ - న్యూజిలాండ్‌ మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. భారత్‌ 23 ఫిబ్రవరి నాడు పాకిస్థాన్‌తో దుబాయ్‌లో ఆడనుంది. ఇప్పుడు, భారత్‌, పాకిస్థాన్‌ తమ స్క్వాడ్లను ఇంకా ప్రకటించలేదు. జనవరి 19 నాటికి అవి ప్రకటించే అవకాశం ఉంది.