World Cup 2023 : నేడు భారత్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. తెలుగోడికి నో ఛాన్స్!
భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నీ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును నేడు ప్రకటించనున్నారు. దీని కోసం రెండు రోజుల కిందటే అగార్కర్ పల్లెకెలెకు చేరుకున్నాడు. ఈ విషయంపై ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ లతో అతను సంప్రదింపులు కూడా జరిపాడు. అయితే ఆసియా కప్ ప్రకటించిన 17 మందితో ప్రపంచ కప్ జట్టును ప్రకటించడం దాదాపు ఖాయమైంది. ఇందులో ఇద్దరిపై సెలెక్టర్లు వేటు వేయనున్నారు. రోహిత్, కోహ్లి, శుభ్‌మన్, హార్దిక్, బుమ్రా, షమి, సిరాజ్, శార్దూల్, జడేజా, కుల్‌దీప్, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్‌ల ఎంపికపై ఎవరికీ సందేహాలు లేవు.
శార్ధుల్ ఠాకూర్ స్థానంలో అర్ష్ దీప్ సింగ్
ఇక ఎన్సీఏ తాజాగా నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ పాసైన విషయం తెలిసిందే. అసియా కప్ జట్టులో భాగమైన తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు చోటు దక్కదని తెలుస్తోంది. మరోవైపు కీపర్ సంజుశాంసన్, పేసర్ ప్రసిద్ధ్ కృష్ణకు ప్రపంచ కప్ 2023 జట్టులో చోటు లేదని సమాచారం. ఆల్ రౌండర్ శార్దుల్ ఠాకూర్ స్థానంలో లెప్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్ దీప్ సింగ్ కు అవకాశం ఇచ్చారట. ఇప్పటికే ఆస్ట్రేలియా సహా కొన్ని ప్రధాన దేశాలు వన్డే ప్రపంచ కప్ కోసం జట్లను ప్రకటించాయి. ఒకవేళ ప్రస్తుతం ప్రకటించే జట్టులో ఎవరికైనా ఫిట్ నెస్ సమస్యలు వస్తే సెప్టెంబర్ 25లోపు జట్టులో మార్పులు చేసుకొనే అవకాశం బీసీసీఐకి ఉంది.