Page Loader
IND vs ENG: తొలి వన్డేలో భారత్ ఘన విజయం
తొలి వన్డేలో భారత్ ఘన విజయం

IND vs ENG: తొలి వన్డేలో భారత్ ఘన విజయం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 06, 2025
08:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ పై టీ20 సిరీస్‌ను గెలుచుకున్న టీమ్‌ ఇండియా,వన్డే సిరీస్‌ను కూడా విజయంతో ఆరంభించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌లో జరిగిన తొలి వన్డేలో భారత్‌ ఘన విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది.కేవలం 38.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. వైస్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (87; 96 బంతుల్లో 14×4)అద్భుత ఇన్నింగ్స్‌ ఆడి, తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గాయం కారణంగా కండరాల నొప్పి వేధించినప్పటికీ, గిల్‌ ధైర్యంగా పోరాడాడు. అక్షర్‌ పటేల్‌ (52; 47 బంతుల్లో 6×4, 1×6), శ్రేయస్‌ అయ్యర్‌ (59; 36 బంతుల్లో 9×4, 2×6) అర్ధశతకాలు సాధించి జట్టును ముందుకు నడిపారు. అయితే, ఓపెనర్లు జైస్వాల్‌ (15),రోహిత్‌ శర్మ (2) మరోసారి నిరాశపరిచారు.

వివరాలు 

ఆదిలోనే కోలుకోలేని షాక్‌ 

ఇంగ్లండ్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌, మహమూద్‌, బెతెల్‌, రషీద్‌ తలో వికెట్‌ తీసుకున్నారు. 249 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఐదో ఓవర్లో జోఫ్రా ఆర్చర్‌ వేసిన బంతికి జైస్వాల్‌ (15) షాట్‌ ఆడే ప్రయత్నంలో వికెట్‌ కోల్పోయి, కీపర్‌ సాల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఆ తర్వాతి ఓవర్లోనే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (2) లివింగ్‌స్టన్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అయితే,శుభ్‌మన్‌ గిల్‌ తొలి డౌన్‌లో వచ్చి క్రీజులో స్థిరంగా నిలిచాడు.రెండో డౌన్‌లో వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి జట్టును గాడిలో పెట్టాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి, తమ అర్ధశతకాలను పూర్తిచేశారు.

వివరాలు 

గిల్‌-అక్షర్‌ బ్యాటింగ్‌ 

ఈ జోడీ ప్రమాదకరంగా మారుతుండగా,బెతెల్‌ 16వ ఓవర్ చివరి బంతికి శ్రేయస్‌ను ఎల్బీడబ్ల్యూగా అవుట్‌ చేసి బ్రేక్‌ వేశాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన అక్షర్‌ పటేల్‌ దూకుడుగా ఆడి,గిల్‌తో కలిసి ఇంగ్లండ్‌ బౌలింగ్‌ను చిత్తు చేసాడు. అయితే, విజయానికి 28 పరుగుల దూరంలో ఉండగా,అక్షర్‌ పటేల్‌ రషీద్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. తర్వాత వచ్చిన రాహుల్‌ (2)కూడా ఎక్కువ సేపు నిలవలేక,రషీద్‌ బౌలింగ్‌లో కాట్‌ అండ్‌ బౌల్డ్‌గా అవుటయ్యాడు. ఇక,టీమ్‌ ఇండియా విజయానికి చేరువైన వేళ గిల్‌ మహమూద్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దీంతో మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా మారింది.అయితే, హార్దిక్‌ పాండ్య (9), రవీంద్ర జడేజా (12) జాగ్రత్తగా ఆడి, జట్టును విజయతీరాలకు చేర్చారు.